Parashurama Strike His Mother: పరశురాముడు తన తల్లిని ఎందుకు నరికాడు.. ఉన్న అసలు రహస్యం ఇదే
ఉన్న అసలు రహస్యం ఇదే

Parashurama Strike His Mother: దశావతారాల్లో విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు అజేయుడైన యోధుడు. చిరంజీవిగా నేటికీ భూమిపై నివసిస్తున్నారని నమ్మే ఏకైక అవతారం ఆయనది. పరశురాముడి జీవితంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘట్టం.. తన తల్లి రేణుకా దేవిని శిరచ్ఛేదం చేయడం. వినడానికి క్రూరంగా అనిపించే ఈ సంఘటన వెనుక ఒక మర్మమైన కథ, పితృభక్తి దాగి ఉన్నాయి.
మట్టి కుండ కరగని పవిత్రత
పరశురాముని తల్లి రేణుకా దేవి గొప్ప సన్యాసిని. ఆమె తన పవిత్రత, తపఃశక్తితో ప్రతిరోజూ నది నుండి కాల్చని మట్టి కుండలో నీటిని తీసుకువచ్చేది. ఆమె పవిత్రత కారణంగా ఆ కుండ నీటిలో కరిగేది కాదు. కానీ ఒక రోజు నది ఒడ్డున గంధర్వరాజు చిత్రరథుని విలాసాలను చూసి ఆమె మనసు ఒక్క క్షణం పరధ్యానంలో పడింది. ఆ చిన్న మానసిక విచలనం ఆమె శక్తులను హరించింది. ఆ రోజు కుండ నీటిలో కరగడం ప్రారంభమైంది. ఆమె ఖాళీ చేతులతో ఆశ్రమానికి రాగా మహర్షి జమదగ్ని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుని కోపోద్రిక్తుడు అయ్యాడు.
తండ్రి ఆజ్ఞ - పరశురాముడి తెగింపు
తీవ్ర కోపంతో ఉన్న జమదగ్ని తన కుమారులను పిలిచి, తల్లిని చంపమని ఆదేశించారు. పరశురాముడి నలుగురు అన్నలు తల్లిపై ఆయుధాన్ని ఎత్తలేక నిరాకరించారు. దీంతో తండ్రి వారిని శిలలుగా మార్చాడు. చివరగా పరశురాముడి వంతు రాగా ఆయన తండ్రి ఆజ్ఞను జవదాటలేదు. తన గొడ్డలితో తల్లిని శిరచ్ఛేదం చేశాడు. ఆశ్రమం అంతా ఆ చర్యకు నివ్వెరపోయింది.
వరం అడిగి తల్లిని పునరుజ్జీవింపజేసిన వైనం
తన ఆజ్ఞను పాటించిన కుమారుడి భక్తికి జమదగ్ని ముగ్ధుడై "ఏం వరం కావాలో కోరుకో" అని అడిగారు. పరశురాముడు ఎంతో తెలివిగా మూడు వరాలు కోరారు
తన తల్లి తిరిగి ప్రాణం పోసుకోవాలి.
జరిగిన విషయం ఆమెకు గుర్తుండకూడదు.
శిలలుగా మారిన తన అన్నలు తిరిగి స్పృహలోకి రావాలి.
ముని తన మంత్రించిన నీటిని చల్లగా, తల్లి రేణుక, సోదరులు యథావిధిగా ప్రాణాలు పొందారు.
ఈ కథ మనకు ఏం చెబుతోంది?
పరశురాముడు తన తల్లిని ద్వేషంతో చంపలేదు. తన తండ్రి తపఃశక్తిపై ఉన్న నమ్మకంతో, ఆయన ఆజ్ఞను పాటిస్తూనే తిరిగి తన కుటుంబాన్ని దక్కించుకున్నాడు. ఇది ఆయన పితృభక్తికి, సమయస్ఫూర్తికి నిదర్శనం.

