Ashadam Special: అమ్మవారికి ఆషాడం ఎందుకంత స్పెషల్..
ఎందుకంత స్పెషల్..

Ashadam Special: తెలంగాణలో ఆషాడమాసం వచ్చిందంటే చాలు ఊరూరా బోనాల జాతర జరుగుతుంది.డప్పుచప్పుళ్లతో మార్మోగిపోతాయి పల్లెలు,పట్టణాలు.ముఖ్యమంగా మన హైదరాబాద్ లో బోనాల పండుగ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. పంటలు బాగా పండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని.. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తల్లి కాపాడాలని...అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తారు.
తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన ఆషాఢం బోనాన్ని స్త్రీలే తయారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ..గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ వేడుకుంటారు. తమ గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మెుక్కుకుంటారు.బోనాలు తీసుకెళుతున్న మహిళలపై అమ్మవారు ఉంటుందని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది .. అందుకే ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదాలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు.
ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
