Hanuman Worshipped with Betel Leaves: హనుమంతుడికి తమలపాకుతో ఎందుకు పూజిస్తారు? సీతమ్మ ఇచ్చిన వరం ఏంటి?
సీతమ్మ ఇచ్చిన వరం ఏంటి?

Hanuman Worshipped with Betel Leaves: లోక బాంధవుడు, రామ భక్త హనుమంతుడిని పూజించని వారుండరు. అయితే హనుమంతుడికి ఆకు పూజ లేదా తమలపాకుల మాల వేయడం మనం తరచూ చూస్తుంటాం. అసలు హనుమంతుడిని తమలపాకులతోనే ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత, శ్రీరాముడు విజయం సాధించాడన్న శుభవార్తను మోసుకుంటూ హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్తాడు. సీతమ్మకు ఈ వార్త వినిపించగానే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ఆ సంతోషంలో హనుమంతుడిని దీవించాలని ఆమె చుట్టూ చూస్తుంది. కానీ, అశోకవనంలో ఆమెకు ఎలాంటి పూలు గానీ, బహుమతులు గానీ కనిపించవు. అప్పుడు ఆమెకు ఒక తమలపాకుల తీగ కనిపిస్తుంది. వెంటనే ఆ ఆకులను తెంపి హనుమంతుడి తలపై జల్లుతూ, చిరంజీవిగా వర్ధిల్లమని నిండు మనసుతో దీవిస్తుంది.
సీతమ్మ తల్లి తన చేతులతో స్వయంగా తమలపాకులతో అభిషేకించడంతో, ఆ ఆకులపై హనుమంతుడికి అమితమైన ప్రేమ ఏర్పడింది. అప్పటి నుండి భక్తులు హనుమంతుడికి తమలపాకుల మాలలు వేయడం ఆచారంగా మారింది. తమలపాకు విజయాన్నే కాదు, వినయాన్ని కూడా సూచిస్తుంది. అందుకే కార్యసిద్ధి కలగాలని కోరుకునే వారు హనుమంతుడికి 'ఆకు పూజ' చేయిస్తారు. తమలపాకుకు శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
సాధారణంగా మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు ఈ పూజ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతారు. 11 లేదా 108 తమలపాకులతో మాల కట్టి, రామ నామం జపిస్తూ స్వామికి సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

