Lord Ganesha: ఏ శుభకార్యానికైనా వినాయకుడికే తొలి పూజ ఎందుకు? ప్రథమ పూజ్యుడి వెనుక ఉన్న ఆసక్తికర పౌరాణిక కథనం!
ఆసక్తికర పౌరాణిక కథనం!

Lord Ganesha: హిందూ సంప్రదాయంలో ఏ చిన్న పూజ మొదలుకొని పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు లేదా ఇతర శుభకార్యాలు చేపట్టినా ముందుగా వినాయకుడిని ఆరాధించడం ఆనవాయితీ. ఆ విఘ్నేశ్వరుడిని స్మరించుకున్న తర్వాతే అసలు కార్యక్రమాలు మొదలవుతాయి. అందుకే ఆయనను ప్రథమ పూజ్యుడు అని పిలుస్తారు. అయితే సమస్త దేవతలలో ముందుగా గణపతికే తొలి పూజ ఎందుకు దక్కుతుంది? ఆయనకు ఈ విశిష్ట స్థానం ఎలా లభించింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక ఘట్టం ఉంది.
దేవతల మధ్య తలెత్తిన పోటీ – శివుడి పరీక్ష
పురాణాల ప్రకారం.. పూర్వం దేవతల మధ్య ఒక పెద్ద చర్చ మొదలైంది. సమస్త జగత్తులో ముందుగా ఎవరిని పూజించాలి, ఎవరికి ప్రథమ పూజ్య స్థానం కల్పించాలి అనే వివాదం తలెత్తింది. ఈ సమస్య పరిష్కారం కోసం దేవతలందరూ కలిసి పరమశివుడు, పార్వతీదేవి వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో పరమేశ్వరుడు ఒక పరీక్ష పెట్టాడు.. "ఎవరైతే సమస్త బ్రహ్మాండాన్ని అందరికంటే వేగంగా చుట్టి వస్తారో, వారికే ముల్లోకాలలో ప్రథమ పూజ్యుడయ్యే అర్హత లభిస్తుంది." ఈ మాట విన్న వెంటనే దేవతలంతా తమ తమ వాహనాలను అధిరోహించి బ్రహ్మాండ ప్రదక్షిణ కోసం బయలుదేరారు. కార్తికేయుడు కూడా తన నెమలి వాహనంపై అత్యంత వేగంగా బయల్దేరాడు.
గణపతి చూపిన అపార జ్ఞానం – తల్లిదండ్రులే సమస్త విశ్వం..
మరోవైపు వినాయకుడి వాహనం మూషికం. అది ఇతర వాహనాలంత వేగంగా ప్రయాణించలేదని గణపతికి తెలుసు. కానీ ఆయన కంగారు పడకుండా తన విశేష బుద్ధిబలాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించాడు. గణపతి ఎక్కడికీ వెళ్లకుండా శివపార్వతులను ఒకే చోట కూర్చోబెట్టి, వారికి భక్తితో ప్రదక్షిణలు చేసి చేతులు జోడించి నిలబడ్డాడు.హ శివుడు ఆశ్చర్యంతో
"కుమారా.. బ్రహ్మాండాన్ని చుట్టి రావడానికి వెళ్లకుండా మా చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేశావు?"
అని ప్రశ్నించాడు. దానికి వినాయకుడు వినమ్రంగా.. "తల్లిదండ్రులను మించిన పవిత్ర తీర్థం గానీ, దైవం గానీ ఈ సృష్టిలో లేదు. సమస్త బ్రహ్మాండం, సర్వలోకాలు తల్లిదండ్రుల పాదాల చెంతనే దాగి ఉన్నాయి. మీ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సమస్త విశ్వాన్ని చుట్టి రావడమే" అని సమాధానమిచ్చాడు.
లభించిన వరం – విఘ్న నివారకుడు
వినాయకుడి వివేకానికి, మాతాపితరుల పట్ల ఆయన చూపిన పరమ భక్తికి పరమశివుడు ముగ్ధుడయ్యాడు. ఆనందంతో గణపతిని ఆలింగనం చేసుకున్న శివుడు.. "ఇకపై ముల్లోకాలలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా, అందరికంటే ముందుగా వినాయకుడినే పూజించాలి" అని వరమిచ్చాడు.
అప్పటి నుండి వినాయకుడు ప్రథమ పూజ్యుడిగా పూజలందుకుంటున్నాడు. ఆయనను స్మరించి ప్రారంభించిన ఏ పనైనా ఆటంకాలు, విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుందనేది భక్తుల అచంచల విశ్వాసం.

