Lord Ganesha: వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు నీటిలో నిమజ్జనం చేస్తారు?
ఎందుకు నీటిలో నిమజ్జనం చేస్తారు?

Lord Ganesha: వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఎంటో తెలుసుకుందాం. వినాయకుడి విగ్రహాన్ని మట్టితో తయారుచేసి పూజిస్తారు. ఇది మట్టి నుంచి ప్రాణం పుట్టిందని సూచిస్తుంది. పది రోజుల పూజ తర్వాత అదే మట్టిని మళ్ళీ నీటిలో కలిపేస్తారు. ఇది సృష్టిలోని సత్యమైన సూత్రాన్ని గుర్తు చేస్తుంది: "మట్టి నుంచి వచ్చినది మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది." ఈ ప్రక్రియ జీవితం యొక్క చక్రం, అంటే పుట్టుక, పెరుగుదల, వినాశనాన్ని సూచిస్తుంది. పూజ సమయంలో, మనం ఆ విగ్రహంలో దేవుడిని ఆహ్వానిస్తాం. పూజ పూర్తయిన తర్వాత, ఆ దేవుడి ఆత్మ మనతోనే ఉండిపోతుందని నమ్ముతారు. కానీ ఆ భౌతిక శరీరం (విగ్రహం) తిరిగి ప్రకృతిలో కలిసిపోవడానికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది మనలోని అహంకారాన్ని వదిలిపెట్టి, ఆత్మను దైవంతో ఒకటిగా కలపడానికి సూచిస్తుంది. సాంప్రదాయకంగా, వినాయకుడి విగ్రహాలను మట్టి, సహజ రంగులతో తయారు చేస్తారు. వీటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. కానీ ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో చేసిన విగ్రహాలు ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. ఇవి నీటిని, జీవులను కలుషితం చేస్తున్నాయి. అందుకే, ఇప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను వాడాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ విధంగా వినాయకుడి విగ్రహ నిమజ్జనం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని మరియు ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది.
