Lord Hanuman: శనివారం శని దేవుడి రోజు అయినప్పటికీ హనుమంతుడిని ఎందుకు పూజిస్తారు? రహస్యమిదే..
రహస్యమిదే..

Lord Hanuman: సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజుకూ ఒక విశిష్టత ఉంది. ఆ క్రమంలో శనివారాన్ని న్యాయాధిపతి అయిన శని దేవునికి అంకితమిస్తారు. అయితే శనివారం నాడు శని దేవుడితో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు, దుష్ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా జాతకంలో ఏలినాటి శని , అర్ధాష్టమ శని, శని ధైయా లేదా శని మహాదశ నడుస్తున్నవారు శనివారాల్లో ఆంజనేయ స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఇంతకీ శని దేవుడి రోజున హనుమంతుడిని పూజించడం వెనుక ఉన్న పౌరాణిక కథేంటో తెలుసుకుందాం.
రావణాసురుడి బందిఖానాలో శని దేవుడు
పురాణాల ప్రకారం, లంకాధిపతి అయిన రావణుడు గొప్ప జ్యోతిష్య పండితుడు, అపార శక్తులు కలిగినవాడు. తన కుమారుడు మేఘనాథుడి జాతకంలో గ్రహాలన్నీ అనుకూల స్థానాల్లో ఉండాలన్న అహంకారంతో, నవగ్రహాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని బంధించాడు. తనపై ఎలాంటి చెడు ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో శని దేవుడిని కూడా లంకలోని చీకటి చెరసాలలో బంధించి తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు.
లంకా దహనం.. శని దేవుడికి విముక్తి
సీతాదేవి అన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడిని రావణుడు బంధించి, తోకకు నిప్పు పెట్టాలని ఆదేశిస్తాడు. ఆ సమయంలో బజరంగబలి తన దివ్య తేజస్సుతో లంక మొత్తాన్ని దహనం చేశాడు. ఆ క్రమంలోనే చీకటి బందిఖానాలో బాధపడుతున్న శని దేవుడిని హనుమంతుడు గమనించి, ఆ బంధనాలను తెంచి విడిపించాడు. సుదీర్ఘకాలం పాటు నరకయాతన అనుభవించిన శని దేవుడు, హనుమంతుని కరుణకు ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని వేడుకున్నాడు.
హనుమంతుడికి శని దేవుడు ఇచ్చిన వరం
దానికి పవనపుత్రుడు స్పందిస్తూ.. "ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో, నా నామస్మరణ చేస్తారో.. వారిని నీ ప్రభావం ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు" అని కోరాడు. శని దేవుడు ఆనందంగా ఆ అభ్యర్థనను అంగీకరిస్తూ.. హనుమంతుడిని నిష్టతో ఆరాధించే భక్తులకు శని దోషాల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుందని, వారి దరిదాపుల్లోకి కూడా ఎలాంటి దుష్ప్రభావాలు రావని వరం ప్రసాదించాడు. అందుకే శనివారం నాడు హనుమంతుడిని పూజిస్తే శని బాధలు సమసిపోతాయని నాటి నుంచి నేటి వరకు విశ్వసిస్తున్నారు.
శనివారం నాడు హనుమంతుడిని ఎలా ఆరాధించాలి?
దీపారాధన:
శనివారం ఉదయాన్నే స్నానం ఆచరించి, పూజా మందిరంలో హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటం ఎదుట నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపం వెలిగించాలి.
సిందూర పూజ:
బజరంగబలికి సిందూరం, మల్లె నూనె సమర్పించడం విశేష ఫలితాలనిస్తుంది.
నైవేద్యం:
ఎర్రటి మందార పూలు, బెల్లం, అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి.
స్తోత్ర పఠనం:
హనుమాన్ చాలీసా, సుందరకాండ లేదా సంకట మోచన హనుమానాష్టకం పఠించడం వల్ల మానసిక భయాలు, నకారాత్మక శక్తులు తొలగిపోతాయి.
ఆలయ దర్శనం:
వీలైతే శనివారం సమీపంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ప్రదక్షిణలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గి సర్వ శుభాలు కలుగుతాయి.

