ఇవాళ దివ్య విమాన రథోత్సవం

Yadagirigutta Brahmotsavams: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.యాదగిరిగుట్ట కొండ పైన ఉన్న ప్రధాన ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీ అమ్మవార్ల కల్యాణాన్ని జరిపించారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ స్వామివారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ వేడుకను వీక్షించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం దివ్య విమాన రథోత్సవం. స్వామివారి కల్యాణానికి కొనసాగింపుగా ఈరోజు ఈ రథోత్సవ వేడుక జరగనుంది.ఈరోజు సాయంత్రం వేళలో స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి ఈ రథంపై భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహన సేవ అనంతరం, శ్రీ మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామివారు అత్యంత సుందరంగా అలంకరించిన 'దివ్య విమాన రథం'పై మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారి కల్యాణం తర్వాత జరిగే ఈ రథోత్సవాన్ని చూస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడతారు.

బ్రహ్మోత్సవాల్లో కల్యాణం ముగిసిన తర్వాత ఉత్సవాల ముగింపు సూచికగా హోమాలు నిర్వహిస్తారు. కోనేరులో స్వామివారి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. ఆహ్వానించబడిన దేవతలకు వీడ్కోలు పలికే కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. కల్యాణం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు, ప్రసాదాల పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్డులో రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story