ANGANWADI TELANGANA : అంగన్వాడీల్లో 6,399 టీచర్.. 7,837 హెల్పర్ పోస్టులు భర్తీ
త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం

- అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ ఆమోదం
- నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు
- ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం
తెలంగాణ రాష్ట్రంలో 6వేల 399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణ అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 20 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో కొన్నిచోట్ల రోజువారీ నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు, ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ కష్టతరంగా మారుతోంది. 65 ఏళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం, వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయిచింది. మొత్తం 14,236 పోస్టులకు శిశు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. కానీ నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం దీనిపై సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం ఖాళీల్లో 6,399 టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రిజైన్ చేయడం, ఇప్పటికే పని చేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. 65 ఏళ్లు నిండిన టీచర్లు, సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు. వారి సంఖ్య దాదాపు 7 వేలుగా ఉంది. ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి కేంద్రాల్లో స్థానిక ఆదివాసీలు, గిరిజనుల్ని నియమించి, వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి.
గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి. ఈ రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎలా ముందుకు వెళ్లాలని సంబంధిత శాఖ సమాలోచనలు చేస్తోంది. సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యాబోధన కష్టమవుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేష న్లో సంబంధిత భాషలు తెలిసి ఉండాలన్న నిబంధన చేర్చితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏవిధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని శిశు సంక్షేమశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఆదేశించారు. అధ్యయన నివేదిక అనంతరం ఉద్యోగ ప్రకటనలపై ముందుకు వెళ్లనుంది.
