NARA LOKESH : వీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన లోకేష్

పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజా (వీఆర్) మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారాలోకేష్ ప్రారంభించారు. నెల్లూరు నగరం నడి బొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో 1875వ సంవత్సరంలో స్ధాపించిన ఈ పాఠశాల నిర్లక్ష్యానికి గురై మూత పడింది. ఇదే పాఠశాలలో చదువుకున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చొరవ తీసుకుని 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలును మంత్రి నారాయణతో కలసి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నారాయణ విద్యా సంస్ధల డైరెక్టర్ పొంగూరు షరణిలో కలిసి శిలాఫకలకాన్ని ఆవిష్కరించారు. వీఆర్ స్కూల్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ముందుగా.. పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని గత శనివారం కమిషనర్ ను అభ్యర్థించిన ఇద్దరు చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి.వెంకటేశ్వర్లకు తన చేతుల మీదుగా అడ్మిషన్ ఫాంలు ఏవో వెంకటరమణకు అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన వీఆర్ మున్సిపల్ హైస్కూల్ తరగతి గదులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. యాక్టివిటీ రూమ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, హైడ్రోపోనిక్స్ ల్యాబ్, రోబోటిక్ లాబ్, లైబ్రరీ, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్ లు పరిశీలించారు. ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. అనంతరం ఆధునిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. క్రికెట్, వాలీ బాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం పీ-4 స్ఫూర్తితో డీఎస్ ఆర్ గ్రూప్స్ నిధులతో మూలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల, వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
