NEET PG 2026 Results: దేశవ్యాప్తంగా వైద్య పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ఈ ఫలితాలను మధ్యాహ్నం ప్రకటించింది.

ఆగస్టు 30న జరిగిన ప్రధాన పరీక్షకు 2,63,544 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జైపూర్‌లో విద్యుత్ సమస్య కారణంగా సెప్టెంబర్ 5న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు 2,416 మంది హాజరయ్యారు. అభ్యర్థుల దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, రోల్ నంబర్, సాధించిన స్కోరు, నీట్ పీజీ 2026 ర్యాంకు వివరాలతో కూడిన జాబితాను బోర్డు విడుదల చేసింది.

కేటగిరీల వారీగా కనీస అర్హత కటాఫ్ స్కోర్లు కూడా ప్రకటించారు. జనరల్/ఈడబ్ల్యూఎస్ విభాగంలో 50వ పర్సెంటైల్‌కు సరిపడే 262 మార్కులు, జనరల్ పీడబ్ల్యూబీడీకి 45వ పర్సెంటైల్‌కు 244 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (వారి పీడబ్ల్యూబీడీతో సహా) విభాగంలో 40వ పర్సెంటైల్‌కు 226 మార్కులు అవసరం.

అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి 641 మార్కులు సాధించారు. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఎన్‌బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్ (natboard.edu.in లేదా nbe.edu.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీ కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి రానుంది.

ఫలితాలు ప్రకటనతో అభ్యర్థులు తమ ర్యాంకు, స్కోరు తనిఖీ చేసుకుని కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

Next Story