హార్వర్డ్ లో విదేశీ విద్యార్ధులకు నో ఎంట్రీ !!

- ఇప్పటికే నిధులు నిలిపివేసిన ట్రంప్ సర్కార్
- నష్టపోనున్న వేలాది మంది విదేశీ విద్యార్ధులు
- వర్సిటీ మారక పోతే లీగల్ స్టేటస్ రద్దు
- ఇది అమెరికా స్టూడెంట్లకూ నష్టమే
- యూదు ద్వేషం, హమాస్ అనుకూల వాదం ప్రమాదకరం
- 72 గంటల్లోగా రాజీకి రాకపోతే వీసా ప్రోగ్రామ్ రద్దు
- ఇతర వర్సిటీలు ఒళ్లు దగ్గరుంచుకోవాలని హెచ్చరిక
ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్ధుల ఎన్ రోల్ మెంట్ ఎలిజిబిలిటీని 2025- -2026 కి రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ చర్య వల్ల ప్రస్తుతం ఎన్ రోల్ అయిన 6 వేలమంది విద్యార్ధులు తీవ్రంగా నష్టపోనున్నారు.వీరంతా మరో యూనివర్సిటీకి బదిలీ అవకపోతే వారి లీగల్ స్టేటస్ రద్దయ్యే ప్రమాదముందని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ శాఖ అంటోంది. అయితే ఈ ఉత్తర్వును కోర్టులో సవాల్ చేయాలని వర్సిటీ యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అనేక యూనివర్సిటీలను నిధుల కొరత వేధిస్తుండటానికి తోడు ఈవారంలో వేలాది మంది విద్యార్ధుల లీగల్ స్టేటస్ టెర్మినేట్ చేయడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. చాలా మంది విద్యార్ధుల చదువులు మధ్యలో ఆగిపోయాయి. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా విద్యార్ధులకు కూడా నష్టమేనని వారంటున్నారు.హార్వర్డ్ లో పెరుగుతున్నయూదు ద్వేషం, హమాస్ అనుకూల వాదం వల్ల క్యాంపస్ సెక్యూరిటీ, సేఫ్టీ సందిగ్ధంలో పడుతోందని హోం లాండ్ సెక్యూరిటీ వాదిస్తోంది. హార్వర్డ్ వర్సిటీ యాజమాన్యం 72 గంటల్లోగా రాజీ ధోరణికి రావాలని లేని పక్షంలో వీసా ప్రోగ్రాము రద్దవుతుందని హోం లాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది.ప్రస్తుతం హార్వర్డ్ లో ఉన్న విదేశీ విద్యార్ధులందరినీ మరో వర్సిటీకి బదిలీ కావాలని తమ ఆదేశాలు పాటించకపోతే ఇతర యూనివర్సిటీలకి కూడా ఇదే ఆదేశాలు వర్తిస్తాయని అమెరికా హోం శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే వర్సిటీలో చదవుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కావడమో లేదా దేశం విడిచి వెళ్లడం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని నోయెమ్ హెచ్చరించారు. దీంతోపాటు విదేశీ విద్యార్థులు వీసాలు, అమెరికాలో చదువుకోవడానికి ప్రవేశం పొందే వ్యవస్థ అయిన యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVIS) సర్టిఫికేషన్ కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కాగా, హార్వర్డ్‌లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని క్రిస్టి నోయెమ్ అన్నారు. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదని, అది ఓ అర్హత మాత్రమేనని పేర్కొన్నారు. వర్సిటీలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారు చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చుకుంటున్నాయని ఎక్స్ వేదికగా చెప్పారు. అయితే ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇది చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంది. ఇది యూనివర్సిటీకి, అమెరికాకు తీవ్రమైన హాని కలిగించే అంశమని వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలుపొందినప్పటి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీపై వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ కోరింది. దీనికి వర్సిటీ స్పందించకపోగా ప్రభుత్వానికి లొంగేది లేదని స్పష్టం చేసింది. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేసింది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. దీంతో హార్వర్డ్‌పై ట్రంప్ పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో ఆ వర్సిటీకి అందాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింపజేశారు. అనంతరం విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేశారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేసేది లేదని స్పష్టం చేశారు. తాజాగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిషేధించారు.అమెరికాలో పురాతన, సంపన్న విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. ఈ యూనివర్సిటీలో ప్రతీ ఏడాది 140 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఒక్క మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ కేంబ్రిడ్జ్ క్యాంపస్‌లోనే దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉండటం గమనార్హం. అయితే హార్వార్డ్ యూనివర్శిటీ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై యూఎస్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది.
