ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణలు అవిభక్త కవలలు
యూనివర్శిటీ ప్రాంగణంలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభించిన సీయం రేవంత్‌రెడ్డి

తెలంగాణ పదానికి ప్రత్యామ్నయం ఉస్మానియా యూనివర్శిటీనే అని ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ రెండూ అవిభక్త కవలల్లాంటివని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 1938లో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ అని చెప్పారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పీవీనరసింహారావు, శివరాజ్ పాటిల్‌లు ఈ యూనివర్శిటీ విద్యార్థులే అని తెలిపారు. అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి కూడా ఇదే యూనివర్శిటీ విద్యార్థి అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానిపై మొట్టమొదటి సారిగా చర్చ జరిగేది ఉస్మానియా యూనివర్శిటీలోనే అని చెప్పారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఉస్మానియా యూనివర్శిటీనే అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్శిటీనే అని యాదయ్య, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి వంటి ఉస్మానియా బిడ్డలు రాష్ట్ర సాధానలో సమిధలయ్యారన్నారు. గత పదేళ్ళ పాలనలో ఉస్మానియా యూనివర్శిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని, యూనివర్శిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మేం అలోచన చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధో సంపత్తిని ఉస్మానియో యూనివర్శిటీ నుంచి ఆశిస్తున్నామన్నారు.
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని సీయం రేవంత్‌రెడ్డి అన్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యసనాల నుంచి యువతను బయటపడేలా చేయాలన్నారు. నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే అని సీయం తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీయం ప్రకటించారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారు చేసి ఇవ్వండి మళ్లీ యూనివర్సిటీకి వస్తా… ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా అని సీయం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి అని సీయం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుందన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పై కుట్ర చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి పదవి తొలగించారు అయినా సరే మళ్ళీ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. మీ చదువుకు ఏం కావాలో అడగండి ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
