Control Blood Sugar: భోజనానికి 14 గంటల గ్యాప్.. వెజిటెరియన్ డైట్‌తో షుగర్‌కు చెక్!
డైట్‌తో షుగర్‌కు చెక్!

Control Blood Sugar: టైప్-2 డయాబెటిస్ బాధితులకు ఒక మంచి వార్త. కేవలం ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని అద్భుతంగా అదుపులోకి తీసుకురావచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. చికెన్, మటన్ వంటి నాన్-వెజ్‌కు దూరంగా ఉంటూ.. భోజనాల మధ్య 14 గంటల గ్యాప్ ఇస్తే డయాబెటిస్ అజమాయీషి సులువవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు రీసెర్చ్ సెంటర్లలో టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న మహిళలపై ఈ ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా బాధితులకు మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి.. పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, పప్పులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతో కూడిన లాక్టో-వెజిటెరియన్ డైట్‌ను అందించారు.
ముఖ్యంగా ఈ డైట్‌లో టైమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్దపీట వేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో మాత్రమే (కేవలం 10 గంటల వ్యవధిలో) ఆహారం తీసుకునేలా చూశారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు.. అనగా దాదాపు 14 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా 14 గంటల నైట్ ఫాస్టింగ్ పాటించారు.
కొన్ని వారాల పాటు ఈ పద్ధతిని పాటించిన మహిళల్లో అద్భుతమైన మార్పు కనిపించింది. సాధారణ డయాబెటిస్ చికిత్స పొందుతున్నవారితో పోలిస్తే.. ఈ 14 గంటల ఫాస్టింగ్ , వెజిటెరియన్ డైట్ పాటించిన వారిలో HbA1c స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. బరువు నియంత్రణతో పాటు గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందని ఈ అధ్యయనం ద్వారా తేలింది.

