Heart at Risk: నిద్రలో చేసే ఈ 5 తప్పులు గుండెకు ముప్పు! వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు
అస్సలు లైట్ తీసుకోవద్దు

Heart at Risk: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం ఎంత అవసరమో.. నాణ్యమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, మితిమీరిన మొబైల్ వాడకం వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం, చెడు నిద్ర అలవాట్లు దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును పెంచే ఆ 5 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు ఇక్కడ చూద్దాం.
గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే 5 నిద్ర అలవాట్లు
రాత్రిపూట తరచుగా మేల్కొనడం
నిద్రలోకి జారుకున్న తర్వాత మాటిమాటికీ మెలకువ రావడం, తిరిగి నిద్రపట్టడానికి గంటల కొద్దీ సమయం పట్టడం నిద్రలేమి లక్షణాలు. ఈ సమస్య నిరంతరం కొనసాగి, పగటిపూట విపరీతమైన అలసటకు దారితీస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు.ఉ ఇది క్రమంగా అధిక రక్తపోటు సమస్యకు దారితీసి, గుండెపై భారం పెంచుతుంది.
బిగ్గరగా గురక పెట్టడం
చాలామంది గురకను సాధారణ విషయంగా భావిస్తారు. కానీ మితిమీరిన గురక, నిద్రలో అకస్మాత్తుగా శ్వాస ఆగిపోతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేవడం వంటివి అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణాలు కావచ్చు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే రక్తపోటు పెరిగి, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
తగినంత సమయ నిద్రపోకపోవడం
ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే లేవాల్సి రావడం వల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె పనితీరును, రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
అసౌకర్యమైన భంగిమలో నిద్రించడం
కొందరికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఈ భంగిమలో పడుకున్నప్పుడు మెడ ఒకవైపుకు ఎక్కువ సమయం తిరిగి ఉండటం వల్ల మెడ, వెన్నునొప్పులు వస్తాయి. దీనివల్ల నిద్ర చెదిరిపోయి శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. బోర్లా పడుకోవడం వల్ల నేరుగా గుండెపోటు వస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ, రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు సౌకర్యవంతమైన భంగిమలో పడుకోవడమే మంచిది.
నిద్ర వేళల్లో క్రమశిక్షణ లేకపోవడం
ఒకరోజు త్వరగా, మరోరోజు అర్ధరాత్రి దాటాక పడుకోవడం వల్ల శరీరం యొక్క సహజ నిద్ర చక్రం గందరగోళానికి గురవుతుంది. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఉదయాన్నే ఒకే సమయానికి మేల్కొనేలా అలవాటు చేసుకోవడం శరీరానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
ప్రశాంతమైన నిద్ర కోసం పాటించాల్సిన చిట్కాలు
పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టేయాలి.
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో టీ, కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు.
పడకగదిని వీలైనంత వరకు నిశ్శబ్దంగా, చీకటిగా, ప్రశాంతమైన వాతావరణంలో ఉంచుకోవాలి.
తీవ్రమైన గురక లేదా నిద్రలో శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

