వీటిని నిర్లక్ష్యం చేయొద్దు..

Protein Deficiency in the Body: మనం ఎంత బిజీగా ఉన్నా, మన శరీరం లోపల నిరంతరం మరమ్మత్తులు జరుగుతూనే ఉంటాయి. ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత అవసరమో, శరీర నిర్మాణానికి, కణాల పునరుద్ధరణకు ప్రోటీన్ అంత ముఖ్యం. కానీ మనలో చాలామంది కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రోటీన్‌ను విస్మరిస్తున్నారు.

మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని తెలిపే ఆ 6 ప్రధాన సంకేతాలు ఇవే:

కండరాల బలహీనత - అలసట

ఆహారం ద్వారా అందాల్సిన ప్రోటీన్ అందనప్పుడు, శరీరం కండరాల్లో నిల్వ ఉన్న ప్రోటీన్‌ను వాడుకోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా వృద్ధుల్లో ఇది త్వరగా అలసిపోవడానికి, శక్తి లేనట్లు అనిపించడానికి దారితీస్తుంది.

తరచుగా అనారోగ్యం

మన శరీరంలో వ్యాధులతో పోరాడే యాంటీబాడీస్ ప్రోటీన్‌తోనే తయారవుతాయి. ప్రోటీన్ తగ్గితే రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, ఇతర ఇన్‌ఫెక్షన్లు పదేపదే వస్తుంటాయి. చిన్న గాయాలు కూడా నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎముకల ఆరోగ్యంపై ప్రభావం

ఎముకలంటే కేవలం కాల్షియం మాత్రమే కాదు, వాటి సాంద్రతను కాపాడటంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపిస్తే ఎముకలు బలహీనపడి విరిగే ప్రమాదం పెరుగుతుంది.

జుట్టు, చర్మం, గోర్లు

జుట్టు, చర్మం, గోర్లు తయారయ్యేది కెరాటిన్, కొల్లాజెన్ వంటి ప్రోటీన్లతోనే. వీటి లోపం వల్ల జుట్టు పలచబడటం, రంగు మారడం, చర్మం పొడిబారడం, గోర్లు పెళుసుగా మారి విరిగిపోవడం వంటివి జరుగుతాయి.

పదేపదే ఆకలి వేయడం

ప్రోటీన్ తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేసినా లేదా స్వీట్లు తినాలనిపించినా మీ ఆహారంలో ప్రోటీన్ తగ్గిందని అర్థం.

మానసిక స్థితి - బద్ధకం

ప్రోటీన్ లోపం వల్ల మెదడుకు అందాల్సిన సంకేతాలు నెమ్మదించి, బద్ధకం పెరగడం, ఏకాగ్రత తగ్గడం మరియు మానసిక స్థితి మారడం వంటివి జరుగుతాయి.

ప్రోటీన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?

మందుల కంటే సహజ ఆహారంతో ఈ లోపాన్ని సులభంగా సరిదిద్దుకోవచ్చు:

గింజలు: చియా గింజలు, గుమ్మడికాయ గింజలు

డైరీ ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్.

పప్పు ధాన్యాలు: అన్ని రకాల పప్పులు, సోయాబీన్స్..

మాంసాహారం: గుడ్లు, చికెన్, చేపలు.

ముఖ్య గమనిక

ప్రోటీన్ అవసరమే కానీ, మరీ మితిమీరితే అది మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి మీ శరీర బరువుకు తగినంత మాత్రమే తీసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story