Roasted Flax Seeds: ఆరోగ్యానికి వరం.. కాల్చిన అవిసె గింజలు!
కాల్చిన అవిసె గింజలు!

Roasted Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పోషకాల గని అని కూడా అంటారు. ఒక టీస్పూన్ అవిసె గింజల్లో 37 కేలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటిని వేయించి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన అవిసె గింజల వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.
కాల్చిన అవిసె గింజల వల్ల కలిగే 7 ప్రయోజనాలు:
జుట్టు, చర్మ సౌందర్యం: కాల్చిన అవిసె గింజల్లోని ఒమేగా కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లను, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పించి చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి.
శక్తి బూస్టర్: ఉదయం అలసటగా ఉన్నట్లు భావించేవారు కాల్చిన అవిసె గింజలను తింటే వెంటనే శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే అధిక ప్రొటీన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వీటిని పొడి చేసి బ్రెడ్ లేదా శాండ్‌విచ్‌లతో కూడా తినవచ్చు.
మంచి నిద్ర: పడుకునే ముందు కొద్దిగా కాల్చిన అవిసె గింజల పొడిని పాలతో కలిపి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది సెరోటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది.
మెదడు శక్తి పెరుగుదల: మెదడు పనితీరును పెంచడానికి కాల్చిన అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని అన్నం లేదా స్నాక్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
మలబద్ధకం నుంచి రిలీఫ్ : మలబద్ధకంతో బాధపడేవారు అధిక ఫైబర్ కలిగిన కాల్చిన అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
కొలెస్ట్రాల్ నియంత్రణ: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజుకు ఒక టేబుల్ స్పూన్ కాల్చిన అవిసె గింజలను ఉదయం, సాయంత్రం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
బరువు తగ్గుదల: బరువు తగ్గాలనుకునేవారు భోజనం తర్వాత కాల్చిన అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలోని ప్రొటీన్ ఆకలిని తగ్గించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది.
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, వాటిని మితంగానే తీసుకోవడం మంచిది.
