Acidity or Kidney Stones: ఎసిడిటీనా? కిడ్నీలో రాళ్ళా? ఈ లక్షణాలతో సులభంగా గుర్తించండి!
సులభంగా గుర్తించండి!

Acidity or Kidney Stones: కడుపులో లేదా వీపు భాగంలో నొప్పి రాగానే మనలో చాలామంది 'గ్యాస్ లేదా ఎసిడిటీ ఏమో' అనుకుని జెలుసిల్ లేదా టాబ్లెట్ వేసుకుని ఊరుకుంటారు. కానీ, ప్రతీ నొప్పి ఎసిడిటీ కాకపోవచ్చు. అది కిడ్నీలో రాళ్ళ (Kidney Stones) సంకేతం కూడా కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఎసిడిటీ విషయానికి వస్తే... ఈ నొప్పి సాధారణంగా పొట్ట పైభాగంలో లేదా ఛాతీలో మంటగా మొదలవుతుంది. తిన్న తర్వాత పుల్లటి తేన్పులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, వాంతులు అయ్యే భావన రావడం దీని ప్రధాన లక్షణాలు. యాంటాసిడ్ (Antacid) టాబ్లెట్ వేసుకోవడం వల్ల లేదా గ్యాస్ పాస్ అవ్వడం వల్ల ఈ నొప్పి వెంటనే తగ్గుతుంది.
అదే కిడ్నీ స్టోన్స్ విషయానికి వస్తే... ఈ నొప్పి చాలా తీవ్రంగా, భరించలేనిదిగా ఉంటుంది. ఇది వీపు భాగంలో (నడుముకి ఇరువైపులా) లేదా పక్కటెముకల కింద మొదలై... పొత్తికడుపు, తొడల వైపుకు పాకుతుంది. ఈ నొప్పి తగినట్లు వచ్చి మళ్ళీ పెరుగుతుంటుంది (Waves). దీంతో పాటు మూత్రంలో మంట, మూత్రం ఎర్రగా లేదా రక్తం రంగులో రావడం, వికారంతో పాటు తీవ్రమైన వాంతులు, జ్వరం రావడం కిడ్నీ స్టోన్స్ యొక్క స్పష్టమైన సంకేతాలు.
తేడాను ఎలా గుర్తించాలి?
సరళంగా చెప్పాలంటే... ఎసిడిటీ నొప్పి తిన్న ఆహారంతో సంబంధం కలిగి ఉండి కడుపులోనే ఉంటుంది. కానీ కిడ్నీ స్టోన్స్ నొప్పి వీపు నుంచి మొదలై పొత్తికడుపు వైపు ప్రయాణిస్తుంది. సాధారణ గ్యాస్ మందులు వేసుకున్నా కిడ్నీ నొప్పి తగ్గదు.కాబట్టి, నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా మూత్రంలో మంట ఉన్నప్పుడు ఎసిడిటీ అని పొరబడకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించి అల్ట్రాసౌండ్ (Ultrasound) స్కానింగ్ చేయించుకోవడం మంచిది.

