Air Pollution Threatens Unborn Babies: వాయు కాలుష్యంతో గర్భస్థ శిశువులకు ముప్పు.. ముందస్తు ప్రసవాల పెరుగుదల
ముందస్తు ప్రసవాల పెరుగుదల

Air Pollution Threatens Unborn Babies: ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం కేవలం పెద్దవారికే కాదు, గర్భంలో ఉన్న శిశువులకు కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని నెలలు నిండకుండానే ప్రసవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో జరిగే వంద ప్రసవాల్లో 15 నుంచి 20 శాతం వరకు ప్రీమెచ్యూర్ బేబీలు జన్మిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఆరు లేదా ఏడు నెలలకే పుట్టిన శిశువులు చాలా సందర్భాల్లో పురిటిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆధునిక వైద్య సాంకేతికతతో 26 నుంచి 32 వారాల్లో పుట్టినా కూడా శిశువు ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరిగాయి. ఇందుకు శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, అధునాతన పరికరాలు, మంచి ఆస్పత్రి సదుపాయాలు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
కాలుష్యంతో పాటు ఉద్యోగ ఒత్తిళ్లు కూడా గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతున్నాయి. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళలు రాత్రింబవళ్లు పని చేస్తూ ప్రాజెక్టుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి మానసిక, శారీరక ఒత్తిడి గర్భంలో శిశువు ఎదుగుదలను మందగిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. దీని వల్ల తక్కువ బరువుతో, నెలలు నిండని శిశువులు పుట్టే ప్రమాదం పెరుగుతోంది.
32 నుంచి 34 వారాల లోపు లేదా కిలో కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ప్రత్యేక చికిత్స అవసరం. 28 నుంచి 32 వారాల్లో పుట్టినవారికి నవజాత శిశువు వార్డుల్లో సంరక్షణ అందించాలి. 34 వారాలు దాటిన తర్వాత 1.82 కిలోల బరువు ఉంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
నెలలు నిండకుండా పుట్టినా ఆధునిక చికిత్సలు చాలా మంది శిశువులకు కొత్త జీవితం ఇస్తున్నాయి. 24 నుంచి 37 వారాల మధ్య పుట్టినవారిని ప్రీమెచ్యుర్ బేబీగా పరిగణిస్తారు. 500 గ్రాములతో పుట్టినా కూడా వారి బరువు పెంచి ఆరోగ్యంగా ఉంచే సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తల్లి గర్భంలోని వాతావరణాన్ని అనుకరించి చికిత్స అందించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మంది గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవం చేస్తున్నారు. కాలుష్యం దీనికి ఒక ముఖ్య కారణం. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉండటం వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువులను కాపాడే అవకాశం పెరిగింది. తొలి గంటలోనే సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గర్భాశయానికి ఇన్ఫెక్షన్ సోకడం, తల్లికి బీపీ, కిడ్నీ సమస్యలు, మధుమేహం, రక్తస్రావం వంటివి కూడా ప్రీమెచ్యూర్ బర్త్కు కారణమవుతున్నాయి. తక్కువ వయస్సులో వివాహాలు, ఆలస్య వివాహాలు కూడా ఈ సమస్యను పెంచుతున్నాయి.
రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి నవజాత శిశువు వైద్యురాలు డాక్టర్ నితాషా బగ్గ మాట్లాడుతూ కాలుష్యం, ఒత్తిళ్లు, జీవనశైలి మార్పులు అన్నీ కలిసి ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయని హెచ్చరించారు. గర్భిణులు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు.
వైద్య రంగంలో అభివృద్ధి వల్ల చాలా మంది ప్రీమెచ్యూర్ బేబీలు ప్రాణాలతో బయటపడుతున్నా, నివారణకు కాలుష్య నియంత్రణ, జీవనశైలి మార్పులు అవసరమని నిపుణులు అంటున్నారు. గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి సకాలంలో వైద్య సలహా తీసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

