Amazing Benefits of Okra: బెండకాయతో అద్భుత ప్రయోజనాలు: గుండె ఆరోగ్యం నుంచి మలబద్ధకం వరకు చెక్!
గుండె ఆరోగ్యం నుంచి మలబద్ధకం వరకు చెక్!

Amazing Benefits of Okra: బెండకాయ అనగానే జిగురుగా ఉంటుందని చాలామంది తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ నిజానికి ఈ బెండకాయ మన గుండె ఆరోగ్యానికి, షుగర్ లెవెల్స్ తగ్గడానికి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడే ఒక అద్భుతమైన ఔషధం! అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.
అసలు అరకప్పు ఉడికించిన బెండకాయలో మన శరీరానికి ఏమేం అందుతాయో తెలుసా? కేవలం ఆరు గ్రాముల పిండి పదార్థాలు, ఆరు కేలరీలు, రెండు గ్రాముల పీచు, ఎనిమిది మిల్లీగ్రాముల సోడియంతో పాటు.. ఫోలేట్, విటమిన్ కె, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, మ్యాంగనీస్ లాంటి పోషకాలెన్నో ఇందులో పుష్కలంగా ఉంటాయి.
మెడికల్ రీసెర్చ్‌ల ప్రకారం.. రోజూ బెండకాయ తినేవారిలో ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొవ్వుగా పిలిచే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో గ్లూకోజు మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు తేలింది. అదే సమయంలో గుండెకు మేలు చేసే హెచ్‌డీఎల్, అంటే మంచి కొవ్వు గణనీయంగా పెరుగుతుంది. ఇవన్నీ మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.అంతేకాదు, బెండకాయలోని వృక్ష రసాయనాలు శరీరంలో వాపు ప్రక్రియను అదుపులో పెట్టి, ప్రమాదకరమైన క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి. అలాగే బీపీ, అంటే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయ ఒక వరమనే చెప్పాలి. ఇందులో ఉండే పీచు పదార్థం, మనం తినే ఆహారంలోని చక్కెరను త్వరగా జీర్ణం కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజు లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంటాయి.
చాలామంది వద్దనుకునే ఆ జిగురు ద్రవంలోనే అసలైన రహస్యం ఉంది! ఆ జిగురులో 'పెక్టిన్' అనే పీచు దండిగా ఉంటుంది. ఇది మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. ఫలితంగా తీవ్రమైన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు కూడా తప్పుతుంది.

