వ్యాయామంతో అద్భుత ఫలితాలు

Extra Exercise: ఆయుష్షు పెంచుకోవడానికి గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదని, కేవలం 5 నిమిషాల అదనపు వ్యాయామంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 'ది లాన్సెట్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని తేలింది. ముఖ్యంగా శారీరక శ్రమకు ప్రాధాన్యతనిస్తూ, గంటల తరబడి కూర్చునే అలవాటును పక్కన పెడితే ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పరిశోధన ప్రకారం, రోజుకు కేవలం 5 నిమిషాల పాటు అదనంగా వ్యాయామం చేయడం లేదా కనీసం 30 నిమిషాల పాటు కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుంది. భారీ కసరత్తులు చేయలేకపోయినా, రోజూ కాసేపు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) వల్ల కూడా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. శరీర కదలికలు పెరిగినప్పుడు గుండె పనితీరు మెరుగుపడటంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుందని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది.

అయితే కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా దీర్ఘాయువుకు కీలకమని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. మంచి నిద్ర, పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అలాగే ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ చురుగ్గా ఉంటే, ఆయుష్షును సులభంగా పెంచుకోవచ్చని ఈ తాజా అధ్యయనం ద్వారా వెల్లడవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story