Bones Weakening After Menopause: మహిళల జీవితంలో మెనోపాజ్ అనేది ఒక ముఖ్యమైన దశ. అయితే ఈ దశ దాటిన తర్వాత చాలామంది మహిళల్లో ఎముకల గట్టిదనం క్రమంగా తగ్గుతుంటుంది. ఎముకలు లోపల గుల్లబారి, పెళుసుగా మారి.. చిన్న దెబ్బ తగిలినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అసలు దీనికి కారణం ఏంటో తెలుసా?మహిళల శరీరంలో ఎముకల సాంద్రతను కాపాడటంలో 'ఈస్ట్రోజన్' అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీనివల్లే ఎముకలు బలహీనపడి, వైద్య పరిభాషలో ‘ఆస్టియోపోరోసిస్’ అని పిలిచే తీవ్రమైన ఎముకల సమస్యకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరి ఇలాంటి సమయంలో ఎముకలను మళ్లీ గట్టిపరుచుకోవడం సాధ్యమేనా? దానికి సమాధానం.. ఖచ్చితంగా సాధ్యమే! మన జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకల బలానికి ప్రధానంగా కావాల్సింది కాల్షియం ,విటమిన్-డి. ఇందుకోసం రోజూ తప్పనిసరిగా పాలు తాగాలి. అలాగే, డాక్టర్ల సలహాతో సరైన మోతాదులో విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎముకలు మళ్లీ దృఢంగా మారుతాయి.

ఆహార విషయానికొస్తే.. కేవలం పాలు మాత్రమే కాదు, మన డైట్‌లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను చేర్చుకోవాలి. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రకోలి వంటి కూరగాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు చియా సీడ్స్, బాదం గింజలు, సోయా, అవకాడో, నువ్వులు , గుమ్మడి గింజలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఎముకలకు అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి.

దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం.. బరువు అదుపులో ఉంచుకోవడం. బరువు పెరిగితే ఆ భారం బలహీనమైన ఎముకలపై పడుతుంది. అందుకే, నిపుణులైన ఒక ట్రైనర్ సాయంతో శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించే తేలికపాటి వ్యాయామాలు (Exercises) క్రమం తప్పకుండా చేయాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story