Microwave Ovens: మైక్రోవేవ్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
ఈ తప్పులు అస్సలు చేయకండి

Microwave Ovens: ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించే మైక్రోవేవ్ ఓవెన్లు ఆహారాన్ని వేడి చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే మైక్రోవేవ్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం. పరిశోధనల ప్రకారం.. కొన్ని ఆహారాలను మైక్రోవేవ్ చేయడం వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ. కాబట్టి, మైక్రోవేవ్‌లో వేడి చేయకూడని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
గుడ్లు:
గుడ్లలోని పచ్చసొన, తెల్లసొనలో అధిక నీటి శాతం ఉంటుంది. మైక్రోవేవ్‌లో వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు ఆవిరిగా మారి అధిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీంతో గుడ్డు పగిలిపోయి, మైక్రోవేవ్ లోపల మొత్తం మురికిగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
పండ్లు:
ద్రాక్ష, చెర్రీస్, బ్లూబెర్రీస్ వంటి పండ్లలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని మైక్రోవేవ్‌లో ఉంచినప్పుడు, అధిక వేడికి లోపల నీరు త్వరగా ఆవిరై, పండ్లు పగిలిపోయే ప్రమాదం ఉంది.
పాలకూర:
పాలకూరను మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం. పాలకూరలో అధికంగా ఉండే నైట్రేట్లు మైక్రోవేవ్ వేడి వల్ల నైట్రోసమైన్‌లుగా మారతాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా, వేడి చేయడం వల్ల పాలకూరలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కోల్పోయి దాని పోషక విలువ తగ్గుతుంది.
మాంసం:
పెద్ద మాంసం ముక్కలు మైక్రోవేవ్‌లో సమానంగా ఉడకవు. మైక్రోవేవ్ మాంసం బయటి భాగాన్ని వేగంగా వేడి చేస్తుంది, కానీ లోపలి భాగం పచ్చిగానే ఉండిపోతుంది. సరిగ్గా ఉడికించని మాంసంలో బాక్టీరియా పెరిగి, ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది.
సీఫుడ్:
చేపలు, పీతలు, రొయ్యలు వంటి సీఫుడ్‌ను మైక్రోవేవ్‌లో వేడి చేయడం మంచిది కాదు. ఈ విధంగా వేడి చేస్తే అవి వాటి అసలు రుచిని కోల్పోతాయి. ఎక్కువసేపు వేడి చేస్తే రబ్బరులా గట్టిపడి తినడానికి అనువుగా ఉండవు. అంతేకాకుండా, దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మైక్రోవేవ్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.
