Beat Anemia: రక్తహీనతకు చెక్.. హీమోగ్లోబిన్ స్థాయిలను రాకెట్లా పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..
సూపర్ ఫుడ్స్ ఇవే..

Beat Anemia: ప్రస్తుత కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య రక్తహీనత. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో దీని శాతం తగ్గితే విపరీతమైన అలసట, నీరసం, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, సరైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హీమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచే ఆ అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు
హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అత్యంత అవసరం.
ఆకుకూరలు: పాలకూర, తోటకూర, ముఖ్యంగా మునగాకులో ఐరన్ శాతం చాలా ఎక్కువ.
కూరగాయలు:
నిత్యం ఆహారంలో బీట్‌రూట్, బ్రోకలీ వంటివి చేర్చుకోవడం వల్ల రక్తం వేగంగా వృద్ధి చెందుతుంది.
డ్రై ఫ్రూట్స్: ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు రక్తహీనతను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
విటమిన్-సి..
శరీరంలో కేవలం ఐరన్ ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోదు, అది ఒంటికి పట్టాలి. ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించాలంటే విటమిన్-సి చాలా అవసరం. అందుకే ఐరన్ లభించే ఆహారంతో పాటు నిమ్మరసం, నారింజ, మోసంబి, నెల్లికాయ, స్ట్రాబెర్రీస్ వంటి సిట్రస్ ఫలాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
నల్ల నువ్వుల మ్యాజిక్..
నల్ల నువ్వులలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. నువ్వులను దోరగా వేయించి తేనెతో కలిపి లడ్డూలా చేసుకుని కూడా తినవచ్చు.
దానిమ్మ - ఆపిల్..
ఐరన్ మరియు కాల్షియంతో పాటు పీచు పదార్థాలు (Fibre) ఎక్కువగా ఉండే దానిమ్మ రక్తహీనతతో బాధపడేవారికి ఒక సంజీవని లాంటిది. అలాగే రోజుకో ఆపిల్ తినడం వల్ల కూడా రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
ఐరన్ శోషణను అడ్డుకునే వీటిని దూరం పెట్టండి..
మనం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు టీ, కాఫీ, కోలా డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. వీటిలో ఉండే టాన్సిన్లు, పాలిఫెనాల్స్ శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. అలాగే ఆహారాన్ని వీలైనంత వరకు ఇనుప పాత్రలలో వండుకోవడం వల్ల కూడా శరీరానికి అదనపు ఐరన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

