Belly Fat Increasing After 40: నలభై ఏళ్లు దాటిన తర్వాత చాలామందిలో పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం సాధారణ సమస్యగా మారింది. ఈ బెల్లీ ఫ్యాట్ కేవలం అందం సమస్య కాదు. గుండె జబ్బులు, డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే జిమ్‌కు వెళ్లాలని లేదా కఠినమైన డైట్ పాటించాలని అనుకోవాల్సిన అవసరం లేదు. జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. మజిల్ మాస్ తగ్గితే జీవక్రియ మందగిస్తుంది. తక్కువ క్యాలరీలు మాత్రమే కాలుతాయి. అందుకే బరువు తగ్గడం కష్టమవుతుంది. అయినప్పటికీ సరైన ఆహారం, వ్యాయామం ద్వారా కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. దీనివల్ల మెటబాలిజం మెరుగుపడి బరువు తగ్గుతుంది.

మనసు మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరంలో కోర్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ను పెంచుతుంది. కఠినమైన వ్యాయామాలు చేసినా ఫలితం రాదు. అందుకే యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఒత్తిడిని నియంత్రించుకుంటేనే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

ప్రతిరోజూ వ్యాయామాన్ని జీవనభాగంగా చేసుకోవాలి. ఉదయం వ్యాయామం చేయడం బరువు తగ్గడంలో ఎక్కువగా సహాయపడుతుంది. నడక, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లైట్ ఎక్సర్సైజులు సరిపోతాయి. కఠినమైన వర్కవుట్ అవసరం లేదు.

ఆహారంలో మార్పులు తప్పనిసరి. ప్రోటీన్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అవి వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. కొవ్వు పదార్థాలను పూర్తిగా మానేయాలి. చక్కెర, స్వీట్స్‌ను దూరంగా ఉంచుకోవాలి. చక్కెర తినడం ఆపకపోతే బరువు తగ్గదు.

మంచి నిద్ర చాలా ముఖ్యం. రోజూ కనీసం ఏడు-ఎనిమిది గంటల గాఢ నిద్ర పోవాలి. నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. నిద్ర బాగుంటే శరీరం వ్యాయామాలను తట్టుకుంటుంది, బరువు తగ్గుతుంది.

ఈ చిన్న అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే నలభై ఏళ్ల తర్వాత కూడా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవచ్చు. జీవనశైలి మార్పు మాత్రమే సరిపోతుంది. ప్రత్యేక జిమ్ లేదా కఠిన డైట్ అవసరం లేదు.

Next Story