Health: పాలు మన నిత్యజీవితంలో ఒక భాగం. నేరుగా కాకపోయినా టీ, కాఫీ వంటి రూపాల్లో తీసుకుంటుంటాం. అలాగే పాల ఉత్పత్తులు కూడా మన డైలీ లైఫ్‌లో విరివిగా వాడుతుంటాం. ఎందుకంటే పాలు పోషకాహారం కాబట్టి. పాలలో మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, రైబో ఫ్లావిన్, నియాసిన్ ఉంటాయి. వాటితోపాటు విటమిన్ ఎ, డి, బి12, మైక్రో మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలు పాల ద్వారానే లభిస్తాయి. పాలు మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పాలు తాగితే కంటిచూపు మెరుగవుతుంది.
ఎక్సర్సైజ్, వర్కవుట్స్ వంటివి చేసిన తర్వాత పాలు తాగితే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లు పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకుని తాగడం మంచిది. పాలలో పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకుని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి కంటే పాలు తాగితే దప్పిక తీరుతుంది. పాలు1.5 రెట్లు ఎక్కువగా దాహం తీర్చగలవు. పాలలో 85 – 95 శాతం నీరే ఉంటుంది. పాలు నేరుగా తాగడం ఇష్టం లేని వాళ్లు అందులో కార్న్‌ఫ్లేక్స్, నట్స్, ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. కొందరికి పాలు జీర్ణం కావు. అలాంటివాళ్లు సోయా పాలు, బాదం పాలు, కొబ్బరి పాలు వంటివి తీసుకోవచ్చు.
పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనేది అపోహ. నిజానికి పాలలోని కొవ్వులు అధిక బరువును తగ్గించడంలో సాయపడతాయి. అది కూడా కొవ్వు ఎక్కువగా ఉండే పాలు తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ అందులోని బయో యాక్టివ్ పదార్థం బాడీలో కొవ్వును కరిగేలా చేస్తుంది. పాలు రోజూ తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని స్టడీలు చెప్తున్నాయి. పాలలోని కాల్షియం, నేచురల్ ఫ్యాట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాల్షియం, విటమిన్ డి క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. పెద్దపేగు లేదా ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
