Bloating and Gas Troubling You: కడుపుబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా? అల్లంతో ఇలా చేస్తే క్షణాల్లో ఉపశమనం..
ఉపశమనం..

Bloating and Gas Troubling You: మారుతున్న ఆహారపు అలవాట్లు, వేళకాని వేళల్లో భోజనం చేయడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల నేటి రోజుల్లో చాలామంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు నిత్యం ఎదురవుతుంటాయి. అయితే మన వంటింట్లో సులభంగా లభించే అల్లంతో ఈ సమస్యలకు సహజసిద్ధంగా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరిచే ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. అల్లాన్ని ఏయే రూపాల్లో తీసుకుంటే కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరువెచ్చని పాలలో అల్లం రసం
భోజనం చేసిన తర్వాత చిన్న అల్లం ముక్క నమలడం లేదా గోరువెచ్చని పాలలో కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ నుంచి వేగంగా ఉపశమనం దక్కుతుంది. అల్లాన్ని మెత్తగా దంచి లేదా తురిమి ముద్దలా చేసుకుని పాలతో కలిపి తీసుకున్నా కడుపులో పేరుకుపోయిన గ్యాస్ తగ్గుముఖం పట్టి శరీరం తేలికపడుతుంది.
నువ్వులు, బెల్లం, శొంఠి మిశ్రమం
గ్యాస్ సమస్యతో పాటు పేగు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారికి సంప్రదాయ మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. 25 గ్రాముల పొట్టు తీయని నల్ల నువ్వులు, 100 గ్రాముల స్వచ్ఛమైన బెల్లం, 50 గ్రాముల అల్లం పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ 2 నుంచి 5 గ్రాముల మోతాదులో గోరువెచ్చని పాలతో తీసుకుంటే దీర్ఘకాలిక గ్యాస్ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం, నిమ్మరసం కాంబినేషన్
కొద్దిగా పచ్చి అల్లం తురుముపై కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవాలి. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తక్షణమే నివారిస్తుంది.
వేడి వేడి అల్లం టీ
నీటిలో కొన్ని అల్లం ముక్కలను వేసి బాగా మరిగించి తయారు చేసుకునే అల్లం టీ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. భోజనం తర్వాత ఈ టీని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగడం వల్ల పొట్టలోని గ్యాస్ సమస్య తగ్గి జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.
కడుపు నొప్పికి కషాయం
తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు 25 నుంచి 50 మిల్లీలీటర్ల అల్లం, ఆముదం కషాయానికి 25 మిల్లీగ్రాముల ఇంగువ, స్వల్ప మోతాదులో ఉప్పు కలిపి తీసుకుంటే పొట్ట నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

