Blood in Urine: మన శరీరంలో వచ్చే చిన్న మార్పులైనా సరే.. అవి భవిష్యత్తులో రాబోయే పెద్ద ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. అలాంటి వాటిలో అత్యంత ముఖ్యమైనది, వెంటనే అలర్ట్ అవ్వాల్సిన ఒక లక్షణం – మూత్రంలో రక్తం కనిపించడం. దీనిని వైద్య పరిభాషలో 'హెమటూరియా' (Hematuria) అంటారు. చాలా మంది యూరిన్‌లో రక్తం పడగానే ఏదో ఇన్ఫెక్షన్ అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇది కిడ్నీ క్యాన్సర్ (Kidney Cancer) యొక్క ప్రాథమిక లక్షణం కావచ్చు అని యూరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ క్యాన్సర్,రక్తం:

అసలు కిడ్నీ క్యాన్సర్‌కు, మూత్రంలో రక్తం పడటానికి సంబంధం ఏంటి? కిడ్నీలలో ట్యూమర్ లేదా క్యాన్సర్ గడ్డలు పెరుగుతున్నప్పుడు, అక్కడ ఉండే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. ఆ రక్తం మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఒక్కోసారి రక్తం స్పష్టంగా ఎరుపు రంగులో కనిపిస్తుంది (Gross Hematuria), మరికొన్ని సార్లు కంటికి కనిపించకుండా కేవలం ల్యాబ్ టెస్టుల్లో మాత్రమే బయటపడుతుంది (Microscopic Hematuria). ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే.. ఈ రక్తస్రావం నొప్పి లేకుండా కూడా జరగవచ్చు. నొప్పి లేదు కదా అని లైట్ తీసుకుంటే, లోపల క్యాన్సర్ ముదిరిపోయే ప్రమాదం ఉంది.

ఇతర ముఖ్యమైన లక్షణాలు :

మూత్రంలో రక్తంతో పాటు కిడ్నీ క్యాన్సర్‌ను సూచించే మరికొన్ని ముఖ్యమైన లక్షణాలను కూడా మనం గమనించాలి.

నడుముకు ఒక వైపున లేదా వెన్నుభాగంలో తగ్గని నొప్పి ఉండటం, పొత్తికడుపులో లేదా పక్కటెముకల కింద గడ్డలాంటిది తగలడం, ఎలాంటి కారణం లేకుండా హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట, మరియు తరచూ జ్వరం రావడం వంటివి కిడ్నీ క్యాన్సర్ యొక్క ఇతర ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.

నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?:

యూరిన్‌లో రక్తం పడటానికి కిడ్నీ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) లేదా ప్రొస్టేట్ సమస్యలు కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, సొంత వైద్యం చేసుకోకుండా లేదా ఇన్ఫెక్షన్ అని అశ్రద్ధ చేయకుండా వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్‌ను మొదటి లేదా రెండవ స్టేజ్‌లోనే గుర్తిస్తే.. సర్జరీ ద్వారా దానిని పూర్తిగా నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు పాకే ప్రమాదం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story