Bone Pain After 30: 30 దాటిన వారికే ఎముకల నొప్పులా? విటమిన్ డి వేసుకున్నా తగ్గడం లేదా? అయితే ఇది తప్పక తెలుసుకోండి..
అయితే ఇది తప్పక తెలుసుకోండి..

Bone Pain After 30: ఇటీవలి కాలంలో 30 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో వీపు నొప్పి, భుజాల నొప్పి, మోకాళ్ల నొప్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా మంది దీనిని కేవలం వయస్సు రీత్యా వచ్చే సమస్యగానో లేదా అలసటగానో భావిస్తారు. విటమిన్ డి లోపం ఉందని తెలిసి మాత్రలు లేదా ఇంజెక్షన్లు తీసుకున్నా, నొప్పి తగ్గక సతమతమవుతుంటారు. అసలు సమస్య ఎక్కడ ఉందో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
విటమిన్ డి ఒక్కటే సరిపోదు.. కాల్షియం కూడా ఉండాల్సిందే:
ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం విటమిన్ డి మాత్రమే ఉంటే సరిపోదు, శరీరంలో తగినంత కాల్షియం కూడా ఉండాలి. శరీరంలో కాల్షియం స్థాయిలు సాధారణంగా ఉన్నప్పుడు మాత్రమే విటమిన్ డి సమర్థవంతంగా పనిచేస్తుంది. కాల్షియం లోపం ఉంటే, మీరు ఎన్ని విటమిన్ డి మందులు తీసుకున్నా ఎముకలు బలం పుంజుకోవు.
ఆస్టియోపోరోసిస్ ముప్పు:
ఈ రెండింటిలో ఏది తగ్గినా ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే ఎముకలు సన్నగా మారి, చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఈ అలవాట్లు లేదా పరిస్థితులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి..
ఆఫీసు ఉద్యోగులు:
ఏసీ గదుల్లో, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేస్తూ ఎండ తగలని వారు.
జంక్ ఫుడ్ ప్రియులు:
పోషకాలు లేని ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారు.
మహిళలు: ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఎముకల సాంద్రత వేగంగా తగ్గుతుంది.
ఏం చేయాలి?
వైద్యుల సూచన ప్రకారం ఈ మార్పులు అవసరం:
ముందస్తు పరీక్షలు: విటమిన్ డి పరీక్షతో పాటు కాల్షియం స్థాయిలను కూడా చెక్ చేయించుకోవాలి.
సూర్యరశ్మి:
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 15-20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీరం సహజంగా విటమిన్ డిని గ్రహిస్తుంది.
ఆహారం: పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

