Super Drinks: చురుకైన మెదడు.. రోజంతా శక్తి.. ఈ సూపర్ డ్రింక్స్ గురించి మీకు తెలుసా?
ఈ సూపర్ డ్రింక్స్ గురించి మీకు తెలుసా?

Super Drinks: మారిన జీవనశైలిలో ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ఈ క్రమంలో తగినంత శక్తి లేక త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ ఒకే ఒక పరిష్కారం.. పోషకాలతో కూడిన స్మూతీలు. ఇవి శరీరానికి కేవలం శక్తిని మాత్రమే కాకుండా మెదడు చురుకుదనాన్ని, మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు ఇంట్లోనే తయారుచేసుకోగలిగే నాలుగు రకాల స్మూతీల గురించి తెలుసుకుందాం..
ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం: అరటిపండు - ఓట్స్ స్మూతీ
ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు లేదా వ్యాయామం చేసేవారికి ఇది ఒక ఎనర్జీ బూస్టర్.
ఏమేం కావాలి?: ఒక అరటిపండు, అర కప్పు ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ బాదం వెన్న.
ప్రయోజనం: ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం వెన్నలోని మంచి కొవ్వులు మీకు చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా చూస్తాయి. ఫలితంగా రోజు మొత్తం నీరసం లేకుండా ఉత్సాహంగా ఉండవచ్చు.
జ్ఞాపకశక్తి పెరగాలంటే: బ్లూబెర్రీ - పాలకూర స్మూతీ
విద్యార్థులకు, మానసిక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఏమేం కావాలి?: అర కప్పు పాలకూర, అర కప్పు బ్లూబెర్రీలు, ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు.
ప్రయోజనం: బ్లూబెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పాలకూరలోని ఐరన్, చియా గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
ఒత్తిడి మటుమాయం: ఫ్రూట్ పంచ్ స్మూతీ
పని ఒత్తిడితో సతమతమయ్యే వారికి ఈ స్మూతీ ఒక గొప్ప రిలీఫ్.
ఏమేం కావాలి?: పైనాపిల్, మామిడి ముక్కలు, నారింజ పండు.
ప్రయోజనం: ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సును ఉత్తేజపరుస్తుంది. సహజ సిద్ధమైన ఈ పండ్ల తీపి మనస్సులో ఆనందాన్ని నింపి, రోజంతా మూడ్‌ను పాజిటివ్‌గా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తికి: స్ట్రాబెర్రీ - ఆరెంజ్ స్మూతీ
చిన్నపాటి వాతావరణ మార్పులకే జలుబు, జ్వరం బారిన పడేవారికి ఇది అద్భుత ఔషధం.
ఏమేం కావాలి?: పావు కప్పు నారింజ రసం మరియు ఒక కప్పు స్ట్రాబెర్రీలు.
ప్రయోజనం: విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది.
కృత్రిమ పానీయాల కంటే సహజమైన పండ్లు, గింజలతో తయారుచేసిన ఈ స్మూతీలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అటు శారీరక శక్తిని, ఇటు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే అద్భుతమైన జీవితానికి పునాది అని మరవకండి.

