Burning Sensation While Urinating: మూత్ర విసర్జనలో మంటగా ఉందా? నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు..

Burning Sensation While Urinating: మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. అయితే ప్రారంభంలో దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే, అది చివరికి మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినేలా చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది?
వైద్య నిపుణుల ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్ ప్రధానంగా ఇ.కోలి అనే ప్రమాదకర బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మూత్ర నాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇబ్బంది పెడుతుంది.
ప్రధాన కారణాలు:
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం, అపరిశుభ్రమైన పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడం, డాక్టర్ సలహా లేకుండా ఇష్టమొచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ముదిరిపోతుంది.
బాడీ ఇచ్చే ఈ సాధారణ లక్షణాలను గమనించండి..
మీకు ఈ క్రింది సమస్యలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి..
మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి రావడం.
తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, కానీ వెళ్లినప్పుడు తక్కువగా రావడం.
మూత్రం నుండి తీవ్రమైన దుర్వాసన రావడం.
పొత్తికడుపు భాగంలో నిరంతరం నొప్పి వేధించడం.
ఇది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?
ఈ ఇన్‌ఫెక్షన్ కేవలం మూత్రాశయానికే పరిమితమైతే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ సకాలంలో మందులు వాడకపోతే, ఈ బాక్టీరియా మెల్లగా మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ కిడ్నీలకు చేరినప్పుడు పరిస్థితి అత్యంత తీవ్రంగా మారుతుంది.
వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అత్యవసర లక్షణాలు:
చలితో కూడిన అధిక జ్వరం రావడం
నిరంతరంగా వాంతులు అవ్వడం.
నడుము భాగంలో లేదా పక్కటెముకల కింద తీవ్రమైన నొప్పి రావడం.
మూత్రంలో రక్తం పడటం.
ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి. లక్షణాలు కనిపించిన వెంటనే సిగ్గుపడకుండా లేదా సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్ కోర్సును పూర్తి చేయడం ద్వారా ఈ ముప్పు నుండి సురక్షితంగా బయటపడవచ్చు.

