Constipation Lead to Cancer:మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వస్తుందా?
క్యాన్సర్ వస్తుందా?

Constipation Lead to Cancer: ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. కడుపులోని కణాలు అసాధారణంగా పెరిగి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. అయితే చాలామంది సాధారణంగా భావించే మలబద్ధకం సమస్యకూ, క్యాన్సర్‌కూ సంబంధం ఉందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
కడుపు క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
లేడీ హార్డింగ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ వివరణ ప్రకారం.. కడుపులోని కణాలు నియంత్రణ కోల్పోయి అసాధారణంగా పెరగడం వల్ల క్యాన్సర్ గడ్డలు ఏర్పడతాయి. దీనికి దారితీసే కొన్ని ముఖ్య కారణాలు..
ఆహారపు అలవాట్లు: అతిగా నూనెలో వేయించిన పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం.
దురలవాట్లు: ధూమపానం, మద్యం సేవించడం వల్ల కడుపు లోపలి పొరలు దెబ్బతింటాయి.
ఇన్ఫెక్షన్లు: కడుపులో హెచ్. పైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం ఉండటం.
ఇతర కారణాలు: వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర, లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించకపోవడం.
మలబద్ధకం - క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి?
చాలామందిని వేధించే మలబద్ధకం నేరుగా క్యాన్సర్‌కు కారణం కానప్పటికీ, ఇది పరోక్షంగా ప్రమాదాన్ని పెంచుతుంది. "దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల ఆహార వ్యర్థాలు ఎక్కువసేపు కడుపులో ఉండిపోతాయి. దీనివల్ల కడుపు కణాలు ప్రతికూల ప్రభావానికి గురై, అంతర్గత ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. మలబద్ధకం వల్ల కలిగే గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మలబద్ధకాన్ని కేవలం చిన్న సమస్యగా భావించి విస్మరించకూడదు.
కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు:
క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారంలో ఈ క్రింది మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు:
పీచు పదార్థం: పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
నీరు: రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగుపడతాయి.
నియంత్రణ: నూనె, కారం, జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి.
కడుపులో నిరంతరం నొప్పి, ఆకలి లేకపోవడం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సకాలంలో గుర్తిస్తే ఏ వ్యాధినైనా జయించవచ్చు.

