థైరాయిడ్ కారణమా..?

Thyroid Problems: మెడ ముందు భాగాన ఉండే థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో చిన్నదే కావచ్చు.. కానీ మన శరీరం సజావుగా పనిచేయడంలో ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవక్రియలు, గుండె వేగం, రక్త ప్రసరణ వంటి ముఖ్యమైన పనులన్నీ ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల మీదే ఆధారపడి ఉంటాయి. మన శరీరం ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా పనిచేయాలనేది థైరాయిడ్ గ్రంథే నిర్ణయిస్తుంది.
ఒకవేళ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల మోతాదులు పడిపోతే.. కేవలం నిస్సత్తువ, బరువు పెరగడం మాత్రమే కాదు, వీటి ప్రభావం నేరుగా గుండె, రక్తనాళాల మీద పడుతుంది. దీనివల్ల రక్తపోటు అంటే బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది. వైద్య అధ్యయనాల ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి 'హైపోథైరాయిడిజమ్'.. అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడమనే సమస్య ఉంటున్నట్లు తేలింది. అయినా చాలామంది దీనిని గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం.
థైరాయిడ్ హార్మోన్లు తక్కువైనప్పుడు గుండె వేగం నెమ్మదిస్తుంది. అదే సమయంలో రక్తనాళాల గోడలు బిగుతుగా మారుతాయి. దీంతో గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) మోతాదులు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి రక్తపోటును పెంచుతాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఇలాగే కొనసాగితే గుండెజబ్బుల ముప్పు ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే.. థైరాయిడ్ సమస్యకు సరైన చికిత్స తీసుకుంటే, ఆటోమేటిక్‌గా రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. అందుకే, అధిక రక్తపోటు ఉన్నవారైనా లేదా అసాధారణంగా బరువు పెరగడం, నిరంతర నిస్సత్తువ, చర్మం పొడిబారటం, జుట్టు పలుచబడటం, మలబద్ధకం, మరియు చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారైనా సరే.. వెంటనే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

