Heart Attack: సాధారణంగా గుండెపోటు అనగానే అందరి దృష్టి మొదట చెడు కొలెస్ట్రాల్ పైకే వెళుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితేనే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే, కొలెస్ట్రాల్ స్థాయిలు పూర్తిగా సాధారణంగా ఉన్నవారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెను లోపలి నుంచి బలహీనపరిచి, హార్ట్ ఎటాక్‌కు దారితీసే మరో 5 ముఖ్యమైన అలవాట్లు, ఆరోగ్య సమస్యల గురించి ఆరోగ్య నిపుణులు వివరించారు.

అధిక రక్తపోటు

హై బీపీ గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. శరీరంలో రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉంటే రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా గుండె కండరాలు క్రమంగా బలహీనపడతాయి. అందుకే క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం, దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

రక్తంలో చక్కెర స్థాయిలు

డయాబెటిస్ లేదా బార్డర్‌లైన్ షుగర్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు అవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి వాటిని బలహీనపరుస్తాయి. కాబట్టి కేవలం కొలెస్ట్రాల్ గురించే కాకుండా, షుగర్ స్థాయిలపై కూడా నిరంతరం నిఘా ఉంచాలి.

నిద్రలేమి

నిద్ర సరిగా లేకపోవడం లేదా రోజూ నిద్రపోయే వేళలు తారుమారు కావడం శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను విపరీతంగా పెంచుతుంది. ఇది నేరుగా రక్తపోటును ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంగా రీఛార్జ్ అవ్వాలంటే ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన, ప్రశాంతమైన నిద్ర అవసరం.

శారీరక శ్రమ లేని జీవనశైలి

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, వ్యాయామం లేని అలవాట్లు గుండె కండరాలను క్షీణింపజేస్తాయి. రోజూ నడక, యోగా లేదా ఏదైనా శారీరక కసరత్తు లేకపోతే శరీరంలో కొవ్వు, కేలరీలు పేరుకుపోయి స్థూలకాయానికి దారితీస్తాయి. ఇది గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది.

పొగాకు, ధూమపానం

సిగరెట్లు తాగడం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం గుండెకు అత్యంత ప్రమాదకరం. పొగాకులోని విష రసాయనాలు ధమనులను సంకోచింపజేయడమే కాకుండా, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఫలితంగా గుండెకు ప్రాణవాయువు సరఫరా తగ్గిపోయి ఆకస్మిక గుండెపోటు ముప్పు పెరుగుతుంది.

Next Story