Cervical Cancer Prevention: గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ: ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన రెండు కీలక స్క్రీనింగ్ పరీక్షలు
రెండు కీలక స్క్రీనింగ్ పరీక్షలు

Cervical Cancer Prevention: ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ప్రాణాంతక వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ముందు వరుసలో ఉంది. ఏటా లక్షలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, సకాలంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను పూర్తిగా అరికట్టవచ్చు. వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడమే ప్రధాన సమస్య. దీని వల్ల చాలామంది మహిళలు ప్రమాదంలో పడుతున్నారు.
పెళ్లికి ముందే హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనితో పాటు ప్రతి మహిళా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ రెండు పరీక్షలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.
చాలామంది హెచ్‌పీవీ పరీక్ష, ప్యాప్ స్మియర్ పరీక్ష రెండూ ఒకటే అనుకుంటారు. కానీ అవి రెండూ వేరు వేరు ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) లోని కణాల్లో జరుగుతున్న మార్పులను గుర్తించే పరీక్ష. ఈ పరీక్షలో సర్విక్స్ నుంచి కొన్ని కణాల నమూనాను సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. కణాల్లో అసాధారణ మార్పులు ఉన్నాయా, అవి భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా అనేది ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. 21 నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలందరూ క్రమం తప్పకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
రెండోది హెచ్‌పీవీ టెస్ట్. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) శరీరంలో ఉందో లేదో ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. హై-రిస్క్ హెచ్‌పీవీ వైరస్ ఎక్కువ కాలం శరీరంలో ఉంటే అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అందుకే ముందస్తుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యుత్తమమైన నివారణ మార్గం.
ఈ పరీక్షలు ఎందుకు అవసరం? సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు కనిపించవు. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రం కాకముందే గుర్తించి అడ్డుకోవచ్చు. హెచ్‌పీవీ లేదా ప్యాప్ స్మియర్లో ‘పాజిటివ్’ లేదా ‘అసాధారణ మార్పులు’ కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉందని అర్థం కాదు. కేవలం భవిష్యత్తులో ముప్పు ఉందని అర్థం. అలాంటి సందర్భంలో వైద్యుల సలహాతో కొల్పోస్కోపీ లేదా బయాప్సీ వంటి తదుపరి పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.
ప్రతి మహిళా తన ఆరోగ్యాన్ని తానే జాగ్రత్తగా చూసుకోవాలి. సకాలంలో స్క్రీనింగ్ చేయించుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.

