City Life Threatens Eye Health: నగర జీవితం కంటికి శాపం: వాయు కాలుష్యం, స్క్రీన్ల వాడకంతో కంటి సమస్యలు
వాయు కాలుష్యం, స్క్రీన్ల వాడకంతో కంటి సమస్యలు

City Life Threatens Eye Health: నగర జీవితం కేవలం ఉరుకులు పరుగులు మాత్రమే కాదు.. కంటి ఆరోగ్యానికి కూడా పెను సవాళ్లను విసురుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం, డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో అధిక కాలుష్య స్థాయిలు కళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కళ్ళు ఎర్రబడటం, మంట, పొడిబారడం, వాపు వంటి సమస్యలు. నిరంతర కాలుష్యం కన్నీటి పొర యొక్క రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీని వల్ల కంటిశుక్లం, గ్లాకోమా వంటి తీవ్రమైన వ్యాధులు ముందుగానే రావడానికి దారితీయవచ్చు.
డిజిటల్ ఒత్తిడి రెట్టింపు
ఒకవైపు కళ్ళు పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటుంటే, మరోవైపు డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల రెప్పపాటు తగ్గి.. కళ్ళు పొడిబారతాయి. కాలుష్యం కన్నీటి పొరను దెబ్బతీసి, పొడిబారే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
కంటి ఒత్తిడి సంకేతాలు
కంటి ఒత్తిడికి సంబంధించిన మొదటి సంకేతాలు,
కళ్ళు ఎరుపు, మంటగా అనిపించడం.
నిరంతర పొడిబారడం.
కాంతికి సున్నితత్వం పెరగడం.
ఈ లక్షణాలను విస్మరించడం వల్ల కంటి ఉపరితలంపై దీర్ఘకాలిక నష్టం జరగవచ్చు.
కళ్ళను కాపాడుకునే మార్గాలు
మీ కళ్ళను రక్షించుకోవడానికి నిపుణులు ఈ నివారణ చర్యలను సూచిస్తున్నారు:
రక్షణ కవచం: మీరు బయటకు వెళ్ళేటప్పుడు గాగుల్స్ లేదా రక్షిత గ్లాసెస్ ధరించండి.
తేమ: ప్రిజర్వేటివ్‌లు లేని కృత్రిమ కన్నీళ్లతో మీ కళ్ళను తేమగా ఉంచుకోవడం.
20-20-20 నియమం: మీ కళ్ళకు విరామం ఇవ్వడానికి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం అలవాటు చేసుకోండి.
ఆహారం: విటమిన్లు A, C, E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి.

