Pregabalin: మెడికల్ షాపుల్లో ఆ మందు నేరుగా అమ్మితే జైలుకే.. ప్రెగాబాలిన్పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం.. కొత్త రూల్స్ ఇవే..
ప్రెగాబాలిన్పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం.. కొత్త రూల్స్ ఇవే..

Pregabalin: భారతదేశంలో మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ యువతను వ్యసనాల వైపు నెడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నరాల నొప్పి, మూర్ఛ వ్యాధి నివారణకు దేశంలో విస్తృతంగా ఉపయోగించే ప్రెగాబాలిన్ అనే ఔషధం దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది.
ఈ మందును వ్యసనంగా మార్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, దీనిని నియంత్రిత ఔషధాల జాబితా అయిన షెడ్యూల్ హెచ్1 వర్గంలోకి చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ప్రెగాబాలిన్ ఔషధం దేనికి వాడుతారు?
వైద్య శాస్త్రంలో ప్రెగాబాలిన్ అనే ఔషధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అర్హత కలిగిన డాక్టర్లు దీనిని ప్రధానంగా ఈ క్రింది సమస్యల కోసం రోగులకు సిఫార్సు చేస్తుంటారు..
న్యూరోపతిక్ పెయిన్:
డయాబెటిస్ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే తీవ్రమైన నరాల నొప్పి.
మూర్ఛ: ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి నియంత్రణకు.
ఫైబ్రోమయాల్జియా: శరీరం మొత్తం తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడటం.
తీవ్రమైన ఆందోళన: మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గించడానికి.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఔషధాన్ని ఇటీవలి కాలంలో కొందరు యువకులు, డ్రగ్స్ సప్లయర్లు ఒక మత్తు పదార్థంలా, వ్యసనానికి దారితీసేలా దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. ఈ ప్రమాదకరమైన ధోరణిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం డ్రగ్స్ నియమాలు, 2026ను తీసుకువచ్చింది.
-కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
డ్రగ్స్ నియమాలు, 2026 కింద తీసుకువచ్చిన ఈ కొత్త చట్ట సవరణ ప్రకారం.. ప్రెగాబాలిన్‌ను షెడ్యూల్ H1 జాబితాలో 51వ ఔషధంగా చేర్చారు. దీనివల్ల ఇకపై మెడికల్ షాపులు క్రింది నియమాలను కచ్చితంగా పాటించాలి:
నో ప్రిస్క్రిప్షన్ - నో మెడిసిన్:
గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ వైద్యుని కచ్చితమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందును ఫార్మసీలలో నేరుగా కౌంటర్ పై విక్రయించడం చట్టరీత్యా నేరం.
ప్రత్యేక రిజిస్టర్ నిర్వహణ:
ఈ ఔషధాన్ని విక్రయించే ఫార్మసీ యజమానులు.. మందులు కొనుగోలు చేసిన రోగి వివరాలు, వారి చిరునామా, సూచించిన డాక్టర్ పేరు, ప్రిస్క్రిప్షన్ కాపీతో కూడిన పూర్తి సమాచారాన్ని ఒక ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
మూడేళ్ల రికార్డు నిల్వ:
ఈ అమ్మకాల డేటాకు సంబంధించిన రికార్డులను ఫార్మసీలు కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరచడం చట్టప్రకారం తప్పనిసరి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఎప్పుడు తనిఖీ చేసినా ఈ రికార్డులను చూపించాల్సి ఉంటుంది.
-%ఎప్పటి నుండి అమలుల్లోకి వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ చారిత్రాత్మక సవరణ, గెజిట్‌లో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి సరిగ్గా 180 రోజుల (అంటే 6 నెలల) తర్వాత దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. ఫార్మసీలు, ఆసుపత్రులు, తయారీ సంస్థలు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా సన్నద్ధం కావడానికి కేంద్రం ఈ ఆరు నెలల మధ్యంతర కాలాన్ని గడువుగా ఇచ్చింది.

