Rising Temperatures Increase the Risk of Heart Attacks: దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ క్రమంగా పెరుగుతున్నాయి. తీవ్రమైన వేడి, మండే ఎండలు, ఉక్కపోత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రులలో డీహైడ్రేషన్ , వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈ తీవ్రమైన వేడి వాతావరణం గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుందా? అనే ఆందోళన ఇప్పుడు చాలామందిలో వ్యక్తమవుతోంది.

అధిక వేడి నేరుగా గుండెపోటుకు కారణం కాకపోయినప్పటికీ.. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని తీవ్రంగా పెంచుతుంది" అని వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వేసవి కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇంతకీ ఎండలకు, గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సూర్యరశ్మికి.. గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింక్ ఏంటి?

ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, మన శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి అంతర్గతంగా మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి:

గుండెపై అదనపు భారం:

శరీరాన్ని చల్లగా ఉంచే క్రమంలో గుండె రక్తాన్ని సాధారణం కంటే చాలా వేగంగా పంప్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గుండెపై పనిభారం ఒక్కసారిగా పెరుగుతుంది.

రక్తం గడ్డకట్టే ప్రమాదం:

ఎండల వల్ల విపరీతంగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతంతో పాటు సోడియం, పొటాషియం వంటి అవసరమైన ఖనిజాల కొరత ఏర్పడుతుంది. ఇది రక్తపోటు హృదయ స్పందన రేటులో తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది.

రక్తనాళాలలో అడ్డంకులు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో సుదీర్ఘకాలం పాటు నీటి కొరత కొనసాగితే రక్తం చిక్కబడి, గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ రక్తం గడ్డలు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డుపడి, గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది.

ఎండల వల్ల ఎవరికి ప్రమాదం ఎక్కువ?

తీవ్రమైన వడగాల్పులు మరియు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఈ వర్గాల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి..

హై బీపీ ఉన్నవారు:

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారిపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

గుండె జబ్బుల రోగులు:

ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండె ఆపరేషన్ అయినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృద్ధులు:

వయసు పైబడిన వారిలో వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది.

ఎండలో పనిచేసేవారు:

ఫీల్డ్ వర్క్ చేసేవారు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులు మరియు ఎక్కువసేపు నేరుగా ఎండలో గడిపేవారు.

తక్కువగా నీరు తాగేవారు:

శరీరంలో తగినంత ద్రవపదార్థాలు లేక తరచూ డీహైడ్రేషన్ బారిన పడేవారు.

నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు:

మంచినీరు ఎక్కువగా తాగాలి:

దాహం వేసినా, వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. ఒంట్లో గ్లూకోజ్, లవణాల శాతం తగ్గకుండా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవడం చాలా మంచిది.

మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు వద్దు:

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నేరుగా ఎండ తగిలేలా బయట తిరగకపోవడం ఉత్తమం.

తేలికపాటి ఆహారం:

జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే మసాలాలు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి.. ఆకుకూరలు, పిండిపదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

Next Story