Drink Tea on an Empty Stomach Every Morning: చాలామందికి ఉదయం లేవగానే వేడివేడిగా ఓ కప్పు టీ తాగనిదే రోజు గడవదు. బెడ్ టీతో రోజును ప్రారంభించడం కొందరికి అలవాటు అయితే, రోజంతా పదేపదే టీ తాగేవారు మరికొందరు. టీ తాగడం వల్ల శరీరానికి తాజాదనం, ఉత్తేజం వచ్చినట్లు అనిపించినప్పటికీ.. పరగడుపున టీ తాగే అలవాటు కొందరిలో జీర్ణ సమస్యలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుంది?

టీలో కెఫిన్‌తో పాటు పలు రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కడుపులోని ఆమ్లతత్వాన్ని, జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఎసిడిటీ, గ్యాస్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున టీ తాగితే ఆ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. టీ తాగిన వెంటనే కొందరిలో కడుపులో మంట, వికారం, అసౌకర్యం లేదా వాంతి వచ్చినట్లు అనిపించవచ్చు. అయితే ఈ ప్రభావం అందరి శరీరాల్లో ఒకేలా ఉండదు. టీ తాగే పరిమాణం, టీ చిక్కదనం మరియు వ్యక్తిగత శారీరక తత్వాన్ని బట్టి ఈ సమస్య ఆధారపడి ఉంటుంది.

పేగులపై ప్రభావం చూపుతుందా?

టీ తాగడం వల్ల నేరుగా పేగులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేసేందుకు నిర్దిష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ..

మలవిసర్జన భావన:

టీలో ఉండే కెఫిన్ పేగుల కదలికలను ప్రేరేపిస్తుంది. అందుకే చాలామందికి టీ తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇది కడుపునొప్పి లేదా విరేచనాలకు దారితీయవచ్చు.

ఐరన్ గ్రహించడంలో అడ్డంకి:

టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా శరీరానికి అందే ఐరన్‌ను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. రక్తహీనత (ఐరన్ లోపం) ఉన్నవారు టీ తాగే సమయంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

ఉదయం టీ తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీ అలవాటును అందరూ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ చిన్న మార్పులు చేసుకోవడం మంచిది:..

మంచినీటితో ప్రారంభించండి: ఉదయం లేవగానే మొదట ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీరు తాగడం అలవాటు చేసుకోండి.

తేలికపాటి ఆహారం తర్వాతే టీ:

పరగడుపున టీ తాగినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తే.. కనీసం ఒకటి లేదా రెండు బిస్కెట్లు, గుప్పెడు నట్స్ లేదా ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే టీ తాగండి.

పరిమితి ముఖ్యం:

రోజుకు ఒకట్రెండు కప్పుల కంటే ఎక్కువ మోతాదులో, అధిక చిక్కదనంతో కూడిన టీ తాగడం తగ్గించాలి.

Next Story