Sleep After Midnight: నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, రాత్రి వేళల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం, ఓటీటీ కంటెంట్ చూడటం వంటి అలవాట్ల కారణంగా చాలామంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. రాత్రి 12 లేదా 1 గంట వరకు మెలకువగా ఉండటం సర్వసాధారణమైపోయింది. అయితే ప్రతిరోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గడమే కాకుండా.. ఆకలి, హార్మోన్లు, జీవక్రియలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది

అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రమణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మానవ శరీరం సహజమైన "బయోలాజికల్ క్లాక్" ఆధారంగా నడుస్తుంది. ఇది నిద్ర, మేల్కొనే సమయాలు, ఆకలి, శక్తి వినియోగాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ నిద్రపోయే వేళలు మారినప్పుడు ఈ సహజ లయ తారుమారవుతుంది. దీని ఫలితంగా..

పగటి వేళల్లో తీవ్రమైన నీరసం, అలసట

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించడం

ఆహారపు అలవాట్లలో అకస్మాత్తు

మార్పులు చోటుచేసుకుంటాయి.

తీపి పదార్థాలపై కోరిక.. ఊబకాయం ముప్పు

శరీరానికి సరైన విశ్రాంతి లభించనప్పుడు ఆకలిని, కడుపు నిండిన భావనను నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల..

అర్ధరాత్రి వేళల్లో మళ్లీ మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది.

ముఖ్యంగా స్వీట్లు, అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్‌పై దృష్టి మళ్లుతుంది.

అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, దీర్ఘకాలంలో అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

ఇన్సులిన్, మెటబాలిజంపై ప్రభావం

రాత్రి చాలాసేపు మెలకువగా ఉంటూ చిరుతిళ్లు తినడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) స్థాయిల నియంత్రణ తప్పుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. ఫలితంగా మెటబాలిజం మందగించడం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది.

నిపుణులు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలు..

7 నుంచి 9 గంటల నిద్ర:

ప్రతిరోజూ కనీసం 7 నుంచి 9 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

నిర్దిష్ట సమయాలు :పడుకోవడానికి, నిద్రలేవడానికి ప్రతిరోజూ ఒకే సమయాన్ని పాటించాలి

డిజిటల్ డిటాక్స్:

నిద్రపోయేందుకు కనీసం గంట ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టాలి.

సమతుల్య జీవనశైలి:

పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకవేళ పగటిపూట నిరంతరం తీవ్ర అలసట లేదా నిద్రలేమి బాధిస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

Next Story