Why Doctors Ask You to Show Your Tongue: మనం ఏదైనా అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు.. మొదట చేసే పని "ఒక్కసారి నాలుక బయటకు చాచండి" అనడం. చిన్నగా కనిపించే మన నాలుక, శరీరంలోని అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని, ఎదుర్కొంటున్న వ్యాధులను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని మీకు తెలుసా? నాలుక రంగు మరియు ఆకృతిలో వచ్చే మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక సంకేతాలు. ఇంతకీ ఏ రంగు నాలుక ఎలాంటి సంకేతాలను ఇస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

లేత గులాబీ రంగు

మీ నాలుక లేత గులాబీ లేదా ముదురు గులాబీ రంగులో ఉండి, దానిపై చిన్న చిన్న మొటిమల్లాంటి నిర్మాణాలు (పాపిల్లే) ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అర్థం. ఇది శరీరంలో సరైన నీటిశాతం, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ, తగినంత పోషకాహార స్థాయిలను సూచిస్తుంది.

రంగు మారితే ప్రమాద సంకేతమే:

తెలుపు రంగు : నాలుకపై తెల్లటి మచ్చలు రావడం లేదా నాలుక అంతా తెల్లగా మారడం ఇన్ఫెక్షన్‌కు ప్రధాన సంకేతం. శరీరంలో నీటిశాతం తగ్గడం, నోటి పరిశుభ్రత లోపించడం, ధూమపానం, జ్వరం వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ముదురు ఎరుపు రంగు:

నాలుక ముదురు ఎరుపు రంగులోకి మారితే శరీరంలో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్లు అర్థం. కొన్నిసార్లు స్కార్లెట్ ఫీవర్ లేదా బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే 'కవాసకి' వ్యాధిలో కూడా నాలుక ఇలా ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.

పసుపు లేదా నారింజ రంగు:

నోటి పరిశుభ్రత లోపించి బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల నాలుక పసుపు రంగులోకి మారుతుంది. అయితే, కామెర్లు, అజీర్ణం, కాలేయ (లివర్) సమస్యల వల్ల కూడా నాలుక పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది.

ఊదా లేదా నీలి రంగు : ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడానికి ఇది సూచన. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు లేదా రక్తప్రసరణ సమస్యలు ఉన్నప్పుడు నాలుక ఊదా రంగులోకి మారుతుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం అవసరం.

నలుపు రంగు : నాలుక నల్లగా, రోమాలు మొలిచినట్లు కనిపించడం చూడటానికి భయానకంగా ఉన్నప్పటికీ ఇది ప్రాణాంతకం కాదు. చనిపోయిన చర్మ కణాలు, ఆహార వ్యర్థాలు, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ధూమపానం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం, కాఫీ-టీలు విపరీతంగా తాగేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది.

నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు:

ప్రతిరోజూ పళ్లు తోముకోవడంతో పాటు, 'టంగ్ క్లీనర్' సహాయంతో నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది.

నాలుక రంగు మారడంతో పాటు.. నొప్పి, వాపు లేదా ఆహారం తినడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నోటి పరిశుభ్రత కేవలం పళ్లకు మాత్రమే పరిమితం కాదు, నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించి అప్రమత్తమవ్వచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story