Blood Sugar Levels Drop During Sleep: నిద్రలో షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయా..? ఈ సైలైంట్ కిల్లర్ గురించి తెలుసుకోండి.
ఈ సైలైంట్ కిల్లర్ గురించి తెలుసుకోండి.

Blood Sugar Levels Drop During Sleep: మధుమేహం ఉన్నవారు సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. కానీ దానికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి ఉంది.. అదే హైపోగ్లైసీమియా. ముఖ్యంగా రాత్రి నిద్రపోతున్న సమయంలో ఇలా షుగర్ లెవెల్స్ పడిపోవడాన్ని వైద్య పరిభాషలో నోక్చురల్ హైపోగ్లైసీమియా లేదా నిశాచర హైపోగ్లైసీమియా అంటారు. రోగి నిద్రలో ఉండటం వల్ల ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించడం చాలా కష్టం. దీనిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రమై, గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. చివరకు గుండెపోటు లేదా కోమాకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలో షుగర్ లెవెల్స్ పడిపోవడానికి ప్రధాన కారణాలు..
ఇన్సులిన్ డోస్ తేడాలు:
రాత్రి పూట అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం లేదా సరైన సమయం పాటించకుండా క్రమరహితంగా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవడం.
రాత్రి వేళల్లో భారీ వర్కౌట్లు:
సాయంత్రం లేదా రాత్రి పొద్దుపోయాక తీవ్రమైన వ్యాయామాలు, హెవీ వర్కౌట్‌లు చేయడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు వేగంగా క్షీణించి, నిద్రలో హైపోగ్లైసీమియా ముప్పు రెట్టింపు అవుతుంది.
రాత్రి భోజనం మానేయడం:
రాత్రి ప్రధాన భోజనం పూర్తిగా మానేయడం లేదా తగినంత కార్బోహైడ్రేట్లు, పోషకాలు లేని జంక్ ఫుడ్స్, చిరుతిళ్లు మాత్రమే తిని పడుకోవడం.
మద్యపాన అలవాటు:
రాత్రిపూట మద్యం సేవించడం వల్ల కాలేయం కొత్త గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయకుండా నిరోధించబడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రమాదకరంగా పడేస్తుంది.
నిద్రలో షుగర్ పడిపోతే కనిపించే లక్షణాలు..
రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కింది లక్షణాలు అనిపిస్తే డయాబెటిస్ రోగులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..
రాత్రి వేళల్లో విపరీతంగా చెమటలు పట్టడం (పడుకున్న బెడ్ షీట్, దుస్తులు తడిసిపోయేలా).
గుండె దడ పెరగడం.
భయంకరమైన పీడకలలు రావడం లేదా కలవరపడుతూ హఠాత్తుగా నిద్రలేవడం.
ఉదయం నిద్ర లేచిన తర్వాత తీవ్రమైన అలసట, తలనొప్పి లేదా గందరగోళంగా అనిపించడం.
అత్యవసర సమయంలో ఏం చేయాలి?
నిద్రలో పైన పేర్కొన్న లక్షణాలతో మెలకువ వస్తే, వెంటనే గ్లూకోమీటర్ ద్వారా షుగర్ లెవెల్స్ తనిఖీ చేయాలి. రీడింగ్ 70 mg/dL కంటే తక్కువగా ఉంటే కింది చిట్కా పాటించండి.
15 గ్రాముల అత్యవసర ఫార్ములా:
లక్షణాలు కనిపించిన వెంటనే 15 గ్రాముల ఫాస్ట్-యాక్టింగ్ కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాన్ని తీసుకోవాలి.
ఉదాహరణకు: ఒక టేబుల్ స్పూన్ తేనె, లేదా అర కప్పు తీపి పండ్ల రసం లేదా 3-4 గ్లూకోజ్ టాబ్లెట్లు, లేదా చాక్లెట్/మిఠాయి తినాలి.
ఇది తీసుకున్న 15 నిమిషాల తర్వాత మళ్లీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికీ సాధారణ స్థాయికి రాకపోతే, మరోసారి ఇదే పద్ధతిని పునరావృతం చేయాలి.
నివారణ చిట్కాలు: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
బెడ్‌టైమ్ రీడింగ్:
డాక్టర్ సూచనల ప్రకారం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తనిఖీ చేసుకునే అలవాటు చేసుకోండి.
సమతుల్య ఆహారం:
రాత్రి భోజనంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోండి. ఇవి రాత్రంతా రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉండేలా చేస్తాయి.
బెడ్‌సైడ్ స్నాక్స్:
అత్యవసరంగా తినడానికి వీలుగా మీ పడకగదిలో ఎల్లప్పుడూ కొన్ని గ్లూకోజ్ బిస్కెట్లు, చాక్లెట్లు లేదా తేనె బాటిల్ సిద్ధంగా ఉంచుకోండి.
టెక్నాలజీ సహాయం:
తరచూ రాత్రి పూట షుగర్ పడిపోయే సమస్య ఉన్నవారు Continuous Glucose Monitor (CGM) డివైజ్ వాడటం మంచిది. ఇది షుగర్ లెవెల్స్ పడిపోగానే అలారం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

