Eating Non-Veg Cause Joint Pain: నాన్‌వెజ్ తింటే కీళ్ల నొప్పులు వస్తాయా? రెడ్ మీట్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు..
నిపుణులు ఏమంటున్నారు..

Eating Non-Veg Cause Joint Pain: రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు తీవ్రమైన కీళ్ల నొప్పులు, వాపులు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమస్యలు ఉన్నవారిని ఆహార నియమాలు పాటించాలని వైద్యులు తరచూ సూచిస్తుంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియుల్లో.. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుందా? అనే సందేహాలు ఉంటాయి. దీనికి గల కారణాలు, నిపుణుల అభిప్రాయాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎలా తయారవుతుంది?
యూరిక్ యాసిడ్ అనేది మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనం. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది. సాధారణంగా మూత్రపిండాలు దీనిని రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు దీనిని సరిగ్గా బయటకు పంపలేనప్పుడు లేదా శరీరంలో దీని ఉత్పత్తి మోతాదుకు మించి పెరిగినప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
రెడ్ మీట్ వల్ల ముప్పు ఎందుకు?
యథార్థ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ ప్రఖర్ గర్గ్ ప్రకారం.. రెడ్ మీట్ ఆర్గాన్ మీట్ (కాలేయం, మూత్రపిండాలు వంటి అంతర్గత అవయవాల మాంసం)లలో ప్యూరిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అధికంగా వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ వేగంగా పెరుగుతుంది. ఆ యాసిడ్ స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి, వాపుతో కూడిన గౌట్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా కాలి బొటనవేలు, చీలమండ, మణికట్టు భాగాల్లో భరించలేని నొప్పి వస్తుంది.
యూరిక్ యాసిడ్ పెరగడానికి ఇతర కారణాలు
కేవలం రెడ్ మీట్ మాత్రమే కాకుండా మరికొన్ని అలవాట్లు, అంశాలు కూడా దీనికి దోహదం చేస్తాయి.
శరీరంలో నీటి కొరత: తక్కువగా నీరు తాగడం వల్ల కిడ్నీల వడపోత మందగిస్తుంది.
ఆల్కహాల్ - చక్కెర పానీయాలు:
మద్యం సేవించడం, అధిక చక్కెర ఉన్న శీతల పానీయాలు తీసుకోవడం.
ఊబకాయం - జీవక్రియ లోపాలు:
అధిక బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. కిడ్నీ సమస్యలు లేదా కొన్ని రకాల మందుల వాడకం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పరిమిత వినియోగం:
మాంసాహారం మితంగా తీసుకోవాలి. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రెడ్ మీట్, ఆర్గాన్ మీట్‌కు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
పుష్కలంగా నీరు తాగడం:
రోజుకు తగిన పరిమాణంలో నీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా సులభంగా బయటకు పోతుంది.
సమతుల్య ఆహారం:
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
నిపుణుల సలహా:
కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు సొంత చిట్కాలు పాటించకుండా వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించి తగిన డైట్ ప్లాన్ తీసుకోవాలి.

