Don’t Ignore Infections: ఇన్ఫెక్షన్లను తేలిగ్గా తీసుకోకండి.. క్యాన్సర్‌కు దారితీయొచ్చు.. అధ్యయనంలో సంచలన విషయాలు..
సంచలన విషయాలు..

Don’t Ignore Infections: మారిన జీవనశైలి, కల్తీ ఆహారం, జంక్ ఫుడ్ మాత్రమే కాదు.. సాధారణంగా భావించే ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతున్నాయని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి ఎనిమిది క్యాన్సర్ కేసుల్లో ఒకటి ఇన్ఫెక్షన్ల వల్లే వస్తోందని తేలింది. ఈ వివరాలు ప్రముఖ వైద్య జర్నల్ ది లాన్సెట్ ఆంకాలజీ లో ప్రచురితమయ్యాయి.
23 లక్షల కేసులకు ఇన్ఫెక్షన్లే మూలం
2024 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.92 కోట్ల (19.2 మిలియన్లు) కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా, అందులో ఏకంగా 23 లక్షల కేసులు ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కేసులన్నింటికీ ప్రధానంగా కేవలం ఐదు రకాల ఇన్ఫెక్షన్లే కారణమవుతున్నాయి.
క్యాన్సర్‌కు దారితీసే ఆ 5 ప్రధాన ఇన్ఫెక్షన్లు ఇవే..
హెలికోబాక్టర్ పైలోరీ
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా కడుపులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. 2024లో నమోదైన క్యాన్సర్ కేసుల్లో దాదాపు 7.6 లక్షల కేసులు దీని వల్లే వచ్చాయి. ఇవి ప్రధానంగా కడుపు క్యాన్సర్ కు దారితీస్తున్నాయి. దీనికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ద్వారా కేసులను భారీగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్
చర్మం, గొంతు, నోరు, అంతర్గత అవయవాల కణాలపై ప్రభావం చూపే వైరస్ ఇది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో అత్యధిక శాతం హెచ్‌పీవీ వల్లే వస్తాయి. పశ్చిమ ఐరోపాలోనే 2024లో దీనివల్ల 24,000 కేసులు నమోదయ్యాయి.
హెపటైటిస్-బి
కాలేయాన్ని దెబ్బతీసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌ను ప్రారంభంలోనే గుర్తించి యాంటీవైరల్ మందులతో నియంత్రించకపోతే లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది
హెపటైటిస్-సి:
హెపటైటిస్-బి, సి రెండూ కలిసి ఇన్ఫెక్షన్ సంబంధిత క్యాన్సర్లలో దాదాపు మూడింట ఒక వంతుకు కారణమవుతున్నాయి. అయితే, ఆధునిక చికిత్సల ద్వారా హెపటైటిస్-సిని సమర్థవంతంగా నయం చేసుకునే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఎప్‌స్టీన్-బార్ వైరస్
ఈ వైరస్ గ్రంథుల జ్వరం కలిగించడంతో పాటు కాలక్రమేణా కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది.
నిపుణుల హెచ్చరిక - పరిష్కారం
క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇన్ఫెక్షన్లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు, సురక్షితమైన ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించుకోవచ్చు. సమయానికి వ్యాక్సినేషన్ (ముఖ్యంగా హెచ్‌పీవీ, హెపటైటిస్-బి వ్యాక్సిన్లు) తీసుకోవడం ద్వారా ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

