Protect Your Skin During Monsoon: ఎక్కువ ప్రోడక్ట్స్ వాడొద్దు: వర్షాకాలంలో మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి!
మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Protect Your Skin During Monsoon: వర్షాకాలం రాగానే ఎండ వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది కానీ... మన చర్మం మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. వాతావరణంలో ఉండే తేమ వల్ల చర్మం జిడ్డుగా, అతుక్కుపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల మన చర్మానికి సరిపడా తేమ ఉందని చాలా మంది పొరపడుతుంటారు. కానీ వర్షాలు, చెమట, కాలుష్యం, ఏసీల ప్రభావం వల్ల చర్మం లోపల తేమ కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చర్మం పైకి జిడ్డుగా కనిపిస్తున్నప్పటికీ... ముఖం కడుక్కున్న తర్వాత చర్మం బిగుతుగా మారడం, గరుకుగా అనిపించడం, దురద పెట్టడం లేదా అకస్మాత్తుగా కాంతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డీహైడ్రేషన్ లక్షణమే. డ్రై స్కిన్ వేరు, డీహైడ్రేటెడ్ స్కిన్ వేరు. నూనె గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల వచ్చేది డ్రై స్కిన్ అయితే... శరీరంలో నీటి శాతం లేదా చర్మం రక్షణ కవచం దెబ్బతినడం వల్ల జిడ్డు చర్మానికి కూడా డీహైడ్రేషన్ రావచ్చు. అందుకే జిడ్డుగా ఉన్నప్పటికీ ముఖం బిగుతుగా మారడం, మేకప్ సరిగ్గా సెట్ కాకపోవడం, సన్నటి గీతలు ఎక్కువగా కనిపించడం వంటి వాటిని గమనించాలి.
మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? వర్షాకాలంలో బోలెడు కొత్త ప్రోడక్ట్స్ వాడేయాల్సిన అవసరం లేదు. కేవలం చర్మం రక్షణ కవచాన్ని (Skin Barrier) కాపాడుకోవడం ముఖ్యం. మృదువైన క్లెన్సర్‌ను వాడడం, వేడి నీళ్లకు బదులుగా సాదా నీటిని ఉపయోగించడం, తగిన మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా అవసరం. గ్లిజరిన్, హైలూరానిక్ యాసిడ్ లేదా సిరమైడ్స్ ఉన్న ప్రోడక్ట్స్ సహాయపడతాయి.
అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదే కానీ... దెబ్బతిన్న చర్మ రక్షణ కవచాన్ని కేవలం నీళ్లు తాగడం ఒక్కటే సరిచేయలేదని నిపుణులు చెబుతున్నారు. అన్ని ప్రయత్నాలు చేసినా చర్మంలో మార్పు రాకపోతే, మొండిగా అలాగే ఉంటే... ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెర్మటాలజిస్ట్ (చర్మ వైద్య నిపుణులు)ను సంప్రదించడం మంచిది.

