Drinking Milk at Night: రాత్రిపూట పాలు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు ఉన్నవారు తాగితే ముప్పే!
ఈ సమస్యలు ఉన్నవారు తాగితే ముప్పే!

Drinking Milk at Night: పాలు సంపూర్ణ ఆహారం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని, శరీరానికి కావాల్సిన కాల్షియం, కార్బోహైడ్రేట్లు అందుతాయని మనందరికీ తెలుసు. అయితే అందరికీ పాలు అమృతం కాకపోవచ్చు. కొంతమందికి పాలు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలు ఎవరికి నో అంటే..
ఊబకాయం: ఇటీవలి కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మానుకోవాలి. పాలలోని కొవ్వు, కేలరీలను శరీరం త్వరగా గ్రహిస్తుంది, దీనివల్ల బరువు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సైనస్ - దగ్గు: సైనస్, జలుబు లేదా తరచూ దగ్గుతో బాధపడేవారు రాత్రిపూట పాలకు దూరంగా ఉండటమే మంచిది. పాలు తాగడం వల్ల శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది, ఇది శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
టైప్ 2 డయాబెటిస్: మధుమేహం ఉన్నవారు పాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలలోని లాక్టోస్ రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచే ప్రమాదం ఉంది. అందుకే డయాబెటిక్ రోగులు రాత్రివేళ పాలు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియ సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట పాలు తాగడం వల్ల ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. ముఖ్యంగా లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్నవారికి ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎప్పుడు తాగాలి?
పాలు తాగడం వల్ల శక్తి లభిస్తుంది, అలసట తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పాలు తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

