Drinking Protein Shakes After a Workout: వర్కౌట్ తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతున్నారా? నీళ్లు సరిగ్గా తాగకపోతే ఏమవుతుందంటే..?
నీళ్లు సరిగ్గా తాగకపోతే ఏమవుతుందంటే..?

Drinking Protein Shakes After a Workout: ఫిట్‌నెస్ ప్రియులు, బాడీబిల్డర్లు వ్యాయామం పూర్తికాగానే ముందుగా వెతికేది ప్రోటీన్ షేక్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం గురించే. కండరాల పెరుగుదలకు , కండరాలు త్వరగా కోలుకోవడానికి శరీరానికి అవసరమైన పూర్తి అమైనో ఆమ్లాలు లభించే బెస్ట్ వే-ప్రోటీన్‌ను ఎంచుకోవడంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అయితే, ఎంత ఖరీదైన, అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్ తీసుకున్నా... వ్యాయామం చేసే సమయంలో శరీరానికి తగినంత నీరు అందించకపోతే ఆ ప్రోటీన్ శరీరానికి సరిగ్గా పట్టదని తాజా పరిశోధనలో వెల్లడైంది. బీజింగ్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం... శరీరం హైడ్రేటెడ్‌గా లేకపోతే మనం తీసుకునే ప్రోటీన్‌ను జీర్ణవ్యవస్థ వేగంగా గ్రహించలేదు.
పరిశోధనలో తేలిన ఆసక్తికర విషయాలు
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 13 మంది ఆరోగ్యకరమైన యువకులను ఎంపిక చేసి, ఒక వారం వ్యవధిలో మూడు వేర్వేరు దశల్లో ట్రెడ్‌మిల్‌పై కఠినమైన వ్యాయామం చేయించారు. ఈ మూడు సెషన్లలో వారికి ఇచ్చిన ప్రోటీన్ పరిమాణాన్ని మార్చకుండా, కేవలం వారు తాగే నీటి పరిమాణాన్ని మాత్రమే మార్చారు.
మొదటి దశ: వ్యాయామ సమయంలో అసలు నీళ్లు ఇవ్వలేదు (పూర్తి డిహైడ్రేషన్).
రెండవ దశ:
చెమట ద్వారా కోల్పోయిన నీటిలో 50 శాతం మాత్రమే తిరిగి తాగించారు.
మూడవ దశ:
వ్యాయామంలో కోల్పోయిన నీటిని 100 శాతం భర్తీ చేస్తూ తగినంత నీరు తాగించారు.
ప్రతి వర్కౌట్ ముగిసిన వెంటనే అందరికీ సమాన పరిమాణంలో ప్రోటీన్ షేక్ ఇచ్చారు. రక్తంలో అమైనో ఆమ్లాల స్థాయిలను కొలవడానికి వర్కౌట్‌కు ముందు, తర్వాత, అలాగే షేక్ తాగిన 60 మరియు 120 నిమిషాల వ్యవధిలో రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు.
నీళ్లు తాగకపోతే ల్యూసిన్, గ్లూటమైన్ శోషణ డకౌట్!
పరీక్షా ఫలితాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వ్యాయామం సమయంలో అసలు నీరు తాగని వారిలో ప్రోటీన్ శోషణ గణనీయంగా పడిపోయింది. ప్రోటీన్ షేక్ తాగిన గంట తర్వాత పరిశీలించగా... నీరు తాగిన సమూహాలతో పోలిస్తే, డిహైడ్రేషన్‌లో ఉన్నవారి రక్తంలో అమైనో ఆమ్లాల స్థాయిలు చాలా తక్కువగా నమోదయ్యాయి.
ముఖ్యంగా కండరాల నిర్మాణానికి అత్యంత కీలకమైన ల్యూసిన్, ఐసోల్యూసిన్, గ్లూటమైన్ వంటి బ్రాంచ్డ్-చైన్ అమైనో ఆమ్లాలు శరీరానికి సరిగ్గా అందలేదు. అయితే, 50 శాతం నీరు తాగిన వారికి, 100 శాతం తాగిన వారికి మధ్య శోషణలో పెద్దగా తేడా కనిపించలేదు. అంటే వ్యాయామ సమయంలో శరీరం పూర్తిగా డ్రై అయిపోకుండా కనీస స్థాయిలో నీరు తాగుతూ ఉన్నా ప్రోటీన్ శోషణ సజావుగా సాగుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రోటీన్ జీర్ణమవ్వడానికి నీరు ఎందుకు ముఖ్యం?
శాస్త్రీయంగా చూస్తే, శరీరం ప్రోటీన్‌ను ముక్కలు చేసి అమైనో ఆమ్లాలుగా మార్చడానికి, వాటిని చిన్నపేగుల నుంచి రక్తప్రవాహంలోకి చేర్చడానికి రక్తంలో నీటి పరిమాణం (బ్లడ్ వాల్యూమ్) స్థిరంగా ఉండాలి:
రక్త ప్రసరణ మందగింపు:
వ్యాయామం వల్ల తీవ్రమైన చెమట పట్టి నీటి శాతం తగ్గినప్పుడు రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ వైపు రక్తప్రవాహం తగ్గి, పోషకాల శోషణ ఆలస్యమవుతుంది.
కిడ్నీలపై భారం:
అధిక ప్రోటీన్ తీసుకున్నప్పుడు శరీరంలో నత్రజని వ్యర్థాలు (యూరియా) పెరుగుతాయి. శరీరం హైడ్రేటెడ్‌గా లేకపోతే కిడ్నీలు ఆ వ్యర్థాలను వడకట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
ఫిట్‌నెస్ ప్రియులు పాటించాల్సిన గోల్డెన్ రూల్స్
వర్కౌట్‌కు ముందు:
వ్యాయామం ప్రారంభించడానికి 1–2 గంటల ముందు సుమారు 400–500 మి.లీ నీరు తాగాలి.
వ్యాయామం మధ్యలో:
గంటల తరబడి నీళ్లు తాగకుండా ఉండకూడదు. సెట్ల మధ్యలో చిన్న చిన్న సిప్స్ (గుక్కలు) రూపంలో 15–20 నిమిషాలకు ఒకసారి నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి.
వర్కౌట్ తర్వాత:
ప్రోటీన్ షేక్ లేదా గుడ్లు, చికెన్ వంటి ఘనాహారం తీసుకునే ముందు, వ్యాయామంలో కోల్పోయిన నీటిని భర్తీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
జిమ్‌లో ఎంత బరువులు ఎత్తామన్నది మాత్రమే కాదు... ఆ కండరాలకు ఆహారం సరిగ్గా చేరాలంటే చేతిలోని వాటర్ బాటిల్ కూడా అంతే ముఖ్యమని ఈ అధ్యయనం గుర్తు చేస్తోంది.

