ఫ్రైడ్ రైస్ మీ ఆరోగ్యం అంతే సంగతులు

Eating Fried Rice Twice a Week: నేటి ఆధునిక జీవనశైలిలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయట రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ముఖ్యంగా ఫ్రైడ్ రైస్ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఫ్రైడ్ రైస్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది ఎందుకు ఆరోగ్యానికి మంచిది కాదో నిపుణులు వివరిస్తున్నారు.

ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు?

ఫ్రైడ్ రైస్‌లో ఉపయోగించే పదార్థాలు, తయారీ విధానం ఆరోగ్యానికి హాని కలిగించే ప్రధాన అంశాలు:

జీర్ణ సమస్యలకు మూలం

ఒకసారి వండిన బియ్యాన్ని మళ్లీ వేడి చేసి వేయించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.

దీనివల్ల గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గుండెకు హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్

ఫ్రైడ్ రైస్ తయారీలో వాడే నూనెను చాలాసార్లు తిరిగి ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు మరియు నూనెను పదే పదే వేడి చేసినప్పుడు, వాటిలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి గుండెకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు బయట లభించే ఫ్రైడ్ రైస్ వంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

అధిక రక్తపోటు ప్రమాదం

ఫ్రైడ్ రైస్‌లో ఉపయోగించే సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వెనిగర్ వంటి అనేక పదార్థాలు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఉప్పు, సాస్‌లలో ఉండే సోడియం దీనికి ప్రధాన కారణం.

ఊబకాయం - బరువు పెరుగుదల:

ముఖ్యంగా చైనీస్, ఫ్రైడ్ రైస్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరిగి ఊబకాయం సమస్యకు దారితీసే అవకాశం ఉంది.

ఇతర లక్షణాలు

ఈ రకమైన ఆహారాలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల తలనొప్పి, ఛాతీ నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాలు కూడా కనిపించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రైడ్ రైస్ వంటి ఫాస్ట్‌ఫుడ్ రుచికరంగా అనిపించినా, వాటిలో పోషక విలువలు తక్కువగా ఉండి, అనారోగ్యకరమైన నూనెలు, పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం, బయట ఫాస్ట్‌ఫుడ్‌ను నియంత్రించి, ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story