Eating Walnuts Every Morning on an Empty Stomach: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తింటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Eating Walnuts Every Morning on an Empty Stomach: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉదయం తీసుకునే మొదటి ఆహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో రారాజుగా చెప్పుకునే వాల్‌నట్స్ పోషకాల గని. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా పాల్‌రివాలా వెల్లడించారు. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల కలిగే 6 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..
గుండె పదిలం.. కొలెస్ట్రాల్‌కు చెక్
వాల్‌నట్స్‌లో గుండెకు మేలు చేసే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఎల్‌డీఎల్ ను తగ్గించి, హెచ్‌డీఎల్ శాతాన్ని పెంచుతాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వులు రక్తనాళాల్లో వాపును అరికట్టి, రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. ఫలితంగా గుండెపోటు వంటి ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
బరువు నియంత్రణ.. మెరుగైన జీవక్రియ
బరువు తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్ ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. దీంతో అనవసరమైన చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, వీటిలో ఉండే పాలీఫెనాల్స్ జీవక్రియ రేటును వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థ పటిష్టం.. గట్ హెల్త్‌కు రక్షణ
వాల్‌నట్స్‌లోని ప్రీబయోటిక్ లక్షణాలు పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఇందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణ.. ఇన్సులిన్ సెన్సిటివిటీ
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. మధుమేహ బాధితులు లేదా షుగర్ ముప్పు ఉన్నవారు ఉదయాన్నే వీటిని పరిమితంగా తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారించవచ్చు.
నిగారింపు చర్మం.. సహజ యాంటీ-ఏజింగ్
వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్-ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి ‘సూపర్‌ఫుడ్’లా మేలు చేస్తాయి. చర్మంలో తేమను నిలిపి ఉంచి పొడిబారకుండా కాపాడతాయి. ముఖంపై ముడతలు, మచ్చలు, మొటిమలను నివారించి, చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా, యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడతాయి.
మెదడుకు పదును.. జ్ఞాపకశక్తి పెంపు
వాల్‌నట్స్‌లోని ఒమేగా-3, పాలీఫెనాల్స్, విటమిన్-ఇ, మెలటోనిన్ నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇవి మెదడు కణాల క్షీణతను అడ్డుకుని, వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యల ముప్పును తగ్గిస్తాయి. మెదడు చురుగ్గా ఆలోచించడానికి, ఏకాగ్రత పెరగడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

