ఏ వయసులో చేసుకుంటే ఉత్తమం?

Egg Freezing: నేటి కాలంలో కెరీర్, చదువు లేదా వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది మహిళలు పెళ్లిని, మాతృత్వాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల నాణ్యత, సంఖ్య తగ్గిపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన అత్యాధునిక సాంకేతికతే 'ఎగ్ ఫ్రీజింగ్'

వయసుతో సంబంధం లేకుండా తల్లి కావాలనుకునే వారికి ఇదోక వరం. సాధారణంగా మహిళల్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య సంతానోత్పత్తి సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత వేగంగా క్షీణిస్తుంది. అందుకే, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలనుకునే మహిళలు తమ అండాలను ఆరోగ్యంగా ఉన్నప్పుడే సేకరించి, అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్నే 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇది మహిళలకు తమ బయోలాజికల్ క్లాక్‌తో సంబంధం లేకుండా, తమకు నచ్చిన సమయంలో తల్లి అయ్యే స్వేచ్ఛను ఇస్తుంది.

వైద్య నిపుణుల ప్రకారం, ఫ్రీజ్ చేసిన అండాలను సిద్ధాంతపరంగా ఎన్ని సంవత్సరాలైనా (10 నుండి 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ) భద్రపరచుకోవచ్చు. అయితే, వీటిని తిరిగి ఉపయోగించే సమయానికి మహిళ వయసు, శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమే. భారతదేశంలో ఐసీఎంఆర్ (ICMR) నిబంధనల ప్రకారం.. క్లినిక్ లభ్యతను బట్టి వీటిని నిర్ణీత కాలం వరకు సురక్షితంగా దాచుకోవచ్చు. వీటిని వాడాలనుకున్నప్పుడు, గడ్డకట్టిన అండాలను కరిగించి (Thawing), ఐవీఎఫ్ (IVF) పద్ధతిలో ఫలదీకరణం చేసి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి 20 ఏళ్ల చివరి నుండి 35 ఏళ్ల లోపు వయసు అత్యంత అనువైనది. 30 ఏళ్ల లోపు అండాలను ఫ్రీజ్ చేసుకుంటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు (Success Rate) చాలా ఎక్కువగా ఉంటాయి. 35 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు, కానీ అండాల నాణ్యత తక్కువగా ఉండటం వల్ల సక్సెస్ రేట్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ పద్ధతి ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story