Safety Precautions to Follow While Bursting Crackers: పటాకులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

Safety Precautions to Follow While Bursting Crackers: దీపావళి పండుగ అంటేనే వెలుగులు, బాణసంచా సందడి. అయితే పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరియు దృష్టి లోపాన్ని నివారించవచ్చు. బాణసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
కంటికి ప్రమాదకరం
బాణసంచా కాల్చడం వల్ల కాలిన గాయాలు, నిప్పురవ్వలు కంట్లో పడటం, కండ్లకలక, కంటి నరాల సమస్య, కళ్లకు రసాయన గాయాలు సంభవించవచ్చు. కాబట్టి, పటాకులు కాల్చే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా నియమాలు
రక్షణ కళ్ళజోడు ధరించాలి: బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా రక్షణ కళ్లజోడు ధరించాలి. ఇది కంటిలోకి నిప్పురవ్వలు, రసాయనాలు పడకుండా కాపాడుతుంది.
సురక్షితమైన దూరం: బాణసంచా నుండి ఎల్లప్పుడూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి. పేలుతున్న పటాకులకు దగ్గరగా ఉండటం చాలా ప్రమాదకరం.
పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ: పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలి. వారు ఒంటరిగా పటాకులు కాల్చడానికి అనుమతించకూడదు.
తక్కువ తీవ్రత పటాకులు: పెద్ద శబ్దం చేసే బాణసంచా కంటే సురక్షితమైన, తక్కువ తీవ్రత కలిగిన బాణసంచా వాడటం ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిది.
పటాకాలకు తయారీ: ఈ మధ్య కాలంలో ఇంట్లో బాణసంచా తయారు చేయడం ప్రాచుర్యం పొందింది. అయితే నాణ్యత లేకపోవడం వల్ల ఇవి ఊహించని పేలుళ్లకు దారితీయవచ్చు. దీనివల్ల కంటి గాయాల ప్రమాదం పెరుగుతుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
పొగకు దూరంగా: కంటి సమస్యలు, అలెర్జీలు ఉన్నవారు వీలైనంత వరకు బాణసంచా పొగలకు దూరంగా ఉండాలి. పొగ కళ్ళలో మంట, దురదను కలిగిస్తుంది.
పర్యావరణం: పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి హానిని తగ్గించే పర్యావరణ అనుకూలమైన బాణసంచా, లైటింగ్ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం.
పండుగ వేళ ఆనందోత్సాహాలు నిండాలంటే భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు పాటించి, దృష్టి లోపం లేకుండా సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
